nampally fire

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఓ భవనంలో నవంబర్ 13 తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి . భవన సముదాయంలో ఉంచిన రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. గాయపడిన 10 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. పై అంతస్తుల్లో నివసించే వారిని కిటికీల ద్వారా బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు 21 మందిని రక్షించారు. ఈ ఘటన నాంపల్లిలోని బజార్‌ఘాట్ ప్రాంతానికి సంబంధించినది. ఇది జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతం, ఇక్కడ అనేక వర్క్‌షాప్‌లు, చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి. వాహనం రిపేరు చేసే వర్క్ షాప్ సైతం బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కారు రిపేర్‌ చేస్తుండగా నిప్పురవ్వ రావడంతో మంటలు చెలరేగాయి. అక్కడ చాలా డ్రమ్ముల్లో ఒక రసాయనాన్ని ఉంచారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అక్కడ ఉంచిన రసాయనం ఫైబర్-ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే మండే గుణం కలిగిన రసాయనమని డీసీపీ తెలిపారు. కొద్దిసేపటికే మంటలు భవనంలోని మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో తొమ్మిది మంది చనిపోయారు. నివేదికల ప్రకారం మృతుల్లో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణం, ఎంత నష్టం జరిగిందనే దానిపై ఖచ్చితమైన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కెటి రామారావు సందర్శించారు. హైదరాబాద్‌లోని శాలిబండలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లోనూ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. 30 ఫైరింజన్లతో పాటు ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.