Telangana: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు
ఆ కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు
Hyd, June 25: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కమిషన్‌ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆ పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘటించారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాలను ప్రతివాదులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగిత్యాలలో సంజయ్ రాకతో జీవన్ రెడ్డి అలక, రాజీనామాకు సిద్ధపడినట్లుగా వార్తలు, బుజ్జగించే పనిలో పెద్దలు
తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 కింద ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే విచారణను ప్రారంభించి, తెలంగాణ విద్యుత్తు సంస్థలకు చెందిన దాదాపు 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖను ఈ నెల 15వ తేదీన కమిషన్‌కు పంపించారు.
తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని కేసీఆర్ ఆ లేఖలో స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ అంశాలపై విచారణ జరిపే అర్హత లేదని తేల్చిచెప్పారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి వెంటనే స్వచ్ఛందంగా వైదొలగాలని (రెక్యూజ్ కావాలని) జస్టిస్ నర్సింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.
ఇక రైల్ రోకో కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విచారణపై హైకోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేసి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. 2011లో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునివ్వడంతో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.