Jagtial, June 24: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మధ్య సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్‌కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే. అయితే ఎమ్మెల్యే సంజయ్ రాకపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఆయన్ని తీసుకోవడంపై ఆయన మండిపడినట్లు తెలుస్తుంది.
ఆ క్రమంలో సోమవారం జగిత్యాలలో తన ముఖ్య అనుచరులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో.. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని టి. జీవన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ రంగంలోకి దిగింది. అందులోభాగంగా ఆ పార్టీ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు కీలక నేతలు.. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
Here's Video
కాంగ్రెస్ పార్టీ పై అలిగిన పెద్దలు జీవన్ రెడ్డి గారి ఇంటికి కాంగ్రెస్ పార్టీ తరపున కాళ్ళ బేరానికి వెళ్లిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ pic.twitter.com/Q6AOpgG8mS
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) June 24, 2024
తొందరపడి ఏ నిర్ణయం తీసుకో వద్దని ఆయన్ని వారంత కోరినట్లు తెలుస్తుంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు గౌరవప్రదంగా రాజకీయం చేశానని వారికి జీవన్‌రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని వారితో జీవన్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ఇంకోవైపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సైతం జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నారు. అందులోభాగంగా ఆయన సైతం.. జీవన్ రెడ్డితో భేటీ అయ్యేందుకు జగిత్యాలకు బయలుదేరి వెళ్లారు.