Teacher Transfers in Telangana: పూర్వపు జిల్లా సర్వీసు ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు, కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం
ఉపాధ్యాయుల బదిలీలకు (Teacher Transfers in Telangana) సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Hyd, Feb 7: ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు (Teacher Transfers in Telangana) సంబంధించి పూర్వపు జిల్లాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు (Govt Teacher Transfers) దరఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు అవకాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జీవో 317తో ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి బదిలీ అయిన 25వేల మందిలో దాదాపు 15వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు కోరుకుంటున్నారని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
దీంతో ఉమ్మడి జిల్లాల్లో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తయిన వారికి కూడా బదిలీల కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతివ్వాలని మంత్రి ఆదేశించారు.జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 ఉంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ సమన్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దాదాపు 59వేల మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన కూడా పూర్తయిందని, ఈ దరఖాస్తులు కూడా వచ్చిన తర్వాత అన్నింటిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.