Hyd, Feb 7: హైదరాబాద్‌లో మూడు డబుల్ డెక్కర్ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులను (Double Decker Buses in Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.
ఈ నెల 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఇ-ప్రిక్స్ నేపథ్యంలో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ ప్రాంతాల్లో ఈ బస్సులు (3 Electric Double Decker Buses) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 11 తర్వాత పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తుంది.
మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం హెచ్‌ఎండీఏ ఆర్డర్ ఇవ్వగా ప్రస్తుతం 3 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మిగిలిన 3 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Here's Update
The first 3 E-Double decker buses ordered by @HMDA_Gov were opened for traffic by Chief secy Ms Santhi Kumari in the presence of @KTRBRS @DrRanjithReddy & @imAkbarOwaisi.
3 more being added shortly.
These will be used for tourism purposes on imp routes! pic.twitter.com/IX3U1heR0m
— Arvind Kumar (@arvindkumar_ias) February 7, 2023
భాగ్య నగరంలో మొత్తం డబుల్ డెక్కర్ బస్సులు 20కి పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఒక్కో బస్సును రూ.2.16 కోట్లతో కొనుగోలు చేశారు. మూడు సంవత్సరాల పాటు బస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. బస్సులో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులకు సీటింగ్ సామర్థ్యం ఉంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ ప్రయాణించవచ్చని, 2 నుంచి 2.5 గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుందని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. నిజాం హయాంలో మొదలైన సాంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు 2003 వరకు నగరంలో తిరిగాయి. అయితే హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఓ నెటిజన్ కోరగా.. ఆ బస్సులలో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న కేటీఆర్, డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ఆయన సూచనల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చింది. అందులో మూడు బస్సులను డెలివరీ చేసి ఈ రోజు ప్రారంభించారు. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడుస్తాయి.