Lockdown Lifted in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత, కీలక నిర్ఱయం తీసుకున్న కేబినెట్, అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖలకు అధికారుల ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
Hyderabad, June 19: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని (Lockdown Lifted in Telangana) కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ (TS Cabinet) ఆదేశించింది. కేబినెట్ తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
రేపటి నుంచి సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి. మే 12 నుంచి జూన్ 19 వరకు 38 రోజులపాటు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగింది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. లాక్‌డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చ చేపట్టింది. దాంతో పాటుగా గోదావరి వాటర్ లిఫ్ట్, హైడల్ పవర్ ఉత్పత్తితో పాటు పలు అంశాలపై కేబినెట్ చర్చించింది
దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారుందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు...జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా, అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది.
Here's CMO Tweet
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు., ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.
కరోనా కేసులు విజృంభించడంతో తొలుత మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా... ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది.
జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.