Telangana: తెలంగాణలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు, కల్వకుంట్ల కవితే ప్రధాన సూత్రధారి అంటూ బీజేపీ ఆరోపణలు, నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేసీఆర్ కూతురు, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఏమన్నారంటే..
ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Hyd, August 23: ఢిల్లీలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణం తెలంగాణకు తాకింది. లిక్కర్ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో (MLC Kalvakuntla Kavitha) నాకు ఎలాంటి సంబంధం లేదని.. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని కవిత అన్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు. బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై (CM KCR) కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆమె అన్నారు.
ఏం జరిగినా కేసీఆర్ వెనక్కి తగ్గరు. ఆయన పోరాటం ఆపరు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది. మీరు అధికారంలో ఉన్నారని విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు.
బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక బీజేపీ ఆరోపణలపై కవిత పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మంజిందర్‌పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కవిత ఆశ్రయించనున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఆమె చర్చలు జరిపారు.
ఇక టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు వచ్చిన కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. తర్వాత బీజేపీ కార్యకర్తలను రిమాండ్‌కు తరలించకుండా పోలీసులను బీజేపీ నేతలు అడ్డగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట ధర్నాకు యత్నించిన బీజేపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వ్యవహారంలో పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ విషయంపై కేంద్ర పెద్దలు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఇదిలా ఉండగా.. కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడికి రావడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని.. ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఈ సందర్భంగా తన సంఘీభావం తెలిపారు.
కుంభకోణంలో కేసీఆర్ కుటుంబీకుల పాత్ర: బీజేపీ
వివాదాస్పద ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. లిక్కర్ మాఫియా వ్యవహారంపై బీజేపీ ఎంపీ పర్వేశ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ కుమార్తె కవిత ఆధ్వర్యంలోనే ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్‌లో లిక్కర్ సెటిల్‌మెంట్లు జరిగాయి. కవిత దక్షిణ భారతదేశానికి చెందిన లిక్కర్ వ్యాపారులను ఢిల్లీకి తీసుకువచ్చారు. కల్వకుంట్ల కవిత ద్వారానే రెడ్డి బ్రదర్స్, మాగుంట ఫ్యామిలీ ఢిల్లీకి వచ్చింది. వీరి ద్వారానే పంజాబ్, గోవా ఎన్నికల కోసం ఆప్ నాయకులకు అడ్వాన్స్‌గా డబ్బులు అందించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీని ఓబెరాయ్ హోటల్‌లో తయారు చేశారు. లిక్కర్ పాలసీలో లబ్ధిపొందిన చాలా మంది వ్యాపారులు ఈ సమావేశాలకు వచ్చారు. కవితసైతం చాలాసార్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఎవరెవరికి లైసెన్స్‌లు ఇవ్వాలనే విషయంలోనూ కవిత మధ్యవర్తిత్వం వహించారు. పంజాబ్‌లో చద్దా ఫ్యామిలీకి చెందిన సీజ్డ్ లిక్కర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారు. ఆ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించినందుకు రూ. 4.50కోట్లు కవిత ద్వారా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకు అందాయి. ఇక, చద్దాస్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసినందుకుగానూ రూ. 3 కోట్ల క్యాష్, కోటిన్నర క్రెడిట్ నోట్ రూపంలో సిసోడియాకు ముడుపులు అందాయి. ఈ డబ్బు మొత్తం కవిత ద్వారానే సిసోడియాకు అందింది. డబ్బు అందగానే చద్దాస్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేశారు. తెలంగాణాలోని లిక్కర్ పాలసీని ఢిల్లీ, పంజాబ్, బెంగాల్‌లో అమలు చేసేలా కవిత మంతనాలు చేస్తున్నారు’’ అని ఆరోపించారు.
పాలసీ రూపకల్పన కోసం ఢిల్లీలోని ఒబెరాయ్, చండీగఢ్‌లోని హయత్ హోటళ్లలో జరిగిన భేటీల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఆ శాఖ అధికారులు, లిక్కర్ మాఫియా∙వ్యక్తులు పాల్గొన్నారు. ఒబెరాయ్ హోటల్లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెల్ల కోసం బుక్ చేశాడు. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేవారు.
లిక్కర్ మాఫియా కమిషన్‌ను 10 శాతానికి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా తొలి విడతగా రూ.150 కోట్లు సిసోడియాకు లంచంగా ముట్టింది. దీన్ని తెలంగాణ లిక్కర్ మాఫియానే ఇచ్చింది. గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఆప్‌కు లిక్కర్ మాఫియా అడ్వాన్స్ చెల్లింపులు జరిపింది. ఆ తర్వాతే పంజాబ్‌లోనూ, ఢిల్లీలోనూ కొత్త మద్యం విధానాల అమలు మొదలైంది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ తరహా ఎక్సైజ్ విధానాన్నే అక్కడ కేసీఆర్ కుటుంబీకులు అమలు చేయించారు’’ అని ఆరోపించారు. లిక్కర్ పాలసీపై కేసీఆర్ కుటుంబీకులతో భేటీ అయ్యారో లేదో సిసోడియా చెప్పాలని డిమాండ్ చేశారు.