BJP MLA Raja singh

Hyd, August 23: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Telangana BJP MLA Raja Singh ) మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలు పాతబస్తీలో హై టెన్షన్‌ క్రియేట్‌ చేశాయి. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా యూ ట్యూబ్‌లో వీడియోను (Youtube Video) విడుదల చేయడం మజ్లిస్‌ నేతలను ఆగ్రహానికి గురి చేసింది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ మజ్లిస్‌ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

రాజా సింగ్ (BJP, MLA Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో​ పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్‌ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

మరోవైపు.. రాజాసింగ్‌ వీడియోపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌.. ముస్లింల మనోభావాలు కించపరిచారంటూ మజ్లిస్‌ నేతలు ఆందోళనలకు దిగారు. మంగళవారం ఉదయం ఎంఐఎం ఎమ్మెల్యే బలాల.. సీపీ కార్యాలయానికి వెళ్లారు. రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో​ పోలీసులు.. యూ ట్యూబ్‌ను రాజాసింగ్‌ వీడియో తొలగించాలని కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు యూ ట్యూబ్‌ వివాదాస్పద వీడియోను తొలగించింది.

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్, మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదు

ఇదంతా జరుగుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో​ మాట్లాడుతూ.. మునావర్‌కు కౌంటర్‌ వీడియోలు చేస్తానని ముందే చేప్పాను. కౌంటర్‌ వీడియోను యూ ట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్‌లోడ్‌ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్‌ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగినా నేను సిద్ధం. ధర్మం కోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నాను అని తెలిపారు.

ముజ్లిస్‌ నేతలు.. తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్‌ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్‌ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో బైఠాయించి నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ పలు పీఎస్‌లలో ఫిర్యాదులు చేశారు. భవానీనగర్‌, డబీర్‌పురా, రెయిన్‌ బజార్‌ పీఎస్‌లలో ఫిర్యాదులు చేయడంతో రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో హై టెన్షన్‌ నెలకొంది.