Hyd, August 23: మహ్మద్ ప్రవక్తపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ( BJP MLA Raja Singh) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డబీర్‌పురా పీఎస్‌లో నమోదైన కేసులో భాగంగా పోలీసులు.. రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం రాజాసింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. ఇక, హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
మహ్మద్ ప్రవక్తను (Prophet Muhammad) కించపరుస్తూ రాజాసింగ్ వీడియో విడుదల చేసిన తర్వాత గత రాత్రి హైదరాబాద్‌లో నిరసనలు చెలరేగాయి. బషీర్‌బాగ్‌లోని నగర కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుట ఆందోళనకారులు నిరసనకు దిగారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజాసింగ్ తమ మనోభావాలను కించపరిచారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కమెడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తే తాను కూడా ఓ ‘కామెడీ’ వీడియోను విడుదల చేస్తానని రాజాసింగ్ గతంలోనే హెచ్చరించారు. ఆయన షో నిర్వహించకుండా అడ్డుకోవాలని, లేదంటే వేదికను తగలబెడతానని హెచ్చరికలు జారీ చేశారు.
Here's ANI Tweet
Telangana | BJP MLA Raja Singh booked for his alleged derogatory comments against Prophet Muhammad. Protests erupted at South Zone DCP office last night demanding action against him. Case registered U/s 295(a), 153(a) & other sections: P Sai Chaitanya, DCP South Zone, Hyderabad
— ANI (@ANI) August 23, 2022
దీంతో మునావర్ ఫరూకీ షో రోజున పోలీసులు రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మునావర్ ఫరూకీ షో నిర్వహించాడు. దీంతో ముందు చెప్పినట్టుగానే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా మాట్లాడారంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తాజా వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. మునావర్ ఫరూకీ తమ మనోభావాలను కించపరిచాడని ఆరోపించారు. ఫరూకీపైనా, ఆయన తల్లిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, మహ్మద్ ప్రవక్తపైనా వ్యాఖ్యలు చేశారు.