Facbook Bans Raja Singh: ఫేస్‌బుక్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నిషేధం, మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అభియోగం
BJP Leader Raja Singh (Photo Credits: ANI)

Hyderabad, September 3:  విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించటం పట్ల పలు రాజకీయ, సామాజిక పక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్క్ ఫేస్‌బుక్ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ ఖాతాను తమ ప్లాట్ ఫాంపై నిషేధించింది. హింస మరియు ద్వేషాన్ని ప్రోత్సహించే విషయాల్లో తమ పాలసీ విధానాలను ఉల్లంఘించినందుకు గానూ రాజాసింగ్ అధికారిక ఖాతాను ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై నిషేధం విధించింది.

"హింసను ప్రోత్సహించే విధంగా విద్వేష పూరిత పోస్టులు చేస్తూ తమ పాలసీ విధానాలను ఉల్లంఘించేలా ప్రవర్తిస్తున్నందుకు రాజా సింగ్‌ను ఫేస్‌బుక్ మరియు అనుబంధ ప్లాట్‌ఫామ్‌ నుండి నిషేధిస్తున్నాం" అని ఫేస్‌బుక్ ఇండియా అధికార ప్రతినిధి ఒక ఈమెయిల్ ప్రకటనలో పేర్కొన్నారు.

గత నెలలో 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' అనే అంతర్జాతీయ మీడియా ప్రచురించిన నివేదిక భారతదేశంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఫేస్‌బుక్ ఇండియా యొక్క పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ భారతదేశంలో అధికార బీజేపీతో సంబంధాలను కలిగి ఉన్నారని. ఈ నేపథ్యంలో భారత్ లో అధికార పార్టీకి చెందిన సభ్యుల సోషల్ మీడియా ఖాతాల ఎలాంటి ఉల్లంఘన నియమాలను వర్తింపజేయటం లేదని పేర్కొంది. ఒకవేళ చేస్తే అది భారతదేశంలో ఫేస్‌బుక్ యొక్క బిజినెస్ దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని వారు భావించి ఉండవచ్చునని పేర్కొంది.

అయితే ప్రతిపక్ష పార్టీలు మరియు ఇతర వర్గాల నుంచి ఫేస్‌బుక్ పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో సంస్థ అంతర్గత సిబ్బంది అప్రమత్తమయి, ఆ తరహాలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న ఖాతాలపై దృష్టి పెట్టిందని పేర్కొంది. "భయంకరమైన వ్యక్తులు మరియు గ్రూపులు" పాలసీ విధానం కింద కొంతమందిని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చిందని పేర్కొంది.

ఈ క్రమంలోనే మొదటి వేటుగా మైనారిటీల పట్ల దూకుడుగా వ్యవహరించే రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం అమలు చేసింది.