Telangana Rains: శాంతించని వరుణుడు, నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు, 12 జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని తెలిపిన సీఎం కేసీఆర్

రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హెచ్చరించింది.

Hyderabad Rains (Photo-Twitter)

Hyd, July 14: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హెచ్చరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ.. ఈ 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ (IMD reverts to red alert) జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో వానలు, వరదలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఈ సందర్భంగా.. వరద పరిస్థితులపై మంత్రులతో ఫోన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని, బయటకు రావొద్దని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలని, సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక, జల దిగ్భంధంలో పలు గ్రామాలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణానది, ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ సాధారణం కంటే రెండింతలకుపైగా వానలు కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో సాధారణంగా జూన్‌ 13 (బుధవారం) నాటికి 21.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 48.54 సెంటీమీటర్ల వాన పడింది. ఇందులో బుధవారం ఒక్కరోజే 6.48 సెంటీమీటర్ల వర్షం పడటం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అతి ఎక్కువ వర్షం కురిసినట్టుగా రికార్డు నమోదైంది.

గోదావరి నదిలో గల్లంతైన 9 మంది సేఫ్, రెండు బోట్లలో బాధితులను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించడంతో.. వాగులు, వంకలు పోటెత్తాయి. చిన్న ప్రాజెక్టులు, చెరువులు నిండాయి. పలుచోట్ల ప్రమాదకర స్థాయికి (rivers, reservoirs still in spate) చేరాయి. వాగులు, ఉప నదుల నీటి చేరికతో గోదావరి ఉగ్ర రూపాన్ని సంతరించుకుంది. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్ నగర్, మర్రివాడ, వాసవీనగర్‌, దొంతలవాడ, బోయిన్ పేట, లైన్ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇండ్లు నీటమునిగాయి.

భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం భద్రాచలంలో 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నీటిమట్టం 58.50 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తున్నది. వరద ప్రవాహం కరకట్టను తాకడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలే, తీవ్ర అల్పపీడనంగా బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 13 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఏపీలో వర్షాలపై సీఎం జగన్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్‌ ఫ్లో కంటే ఇన్‌ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది.

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. 90.30 టీఎంసీల నీటినిల్వకు గాను ఇప్పుడు 74.506 టీఎంసీల నీరు ఉన్నది.ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 54 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టులోకి 13 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 13.30 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.

కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 18 గేట్లు ఎత్తి 1,06,772 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్ సామర్థ్యం 6.657 టీఎంసీలు కాగా, 6.896 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జూరాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నది. జూరాల, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు వస్తున్నది. దీంతో పది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది.