Hyd, July 13: జగిత్యాలలో గోదావరి నదిలో గల్లంతైన తొమ్మిది మంది రైతు కూలీలు సురక్షితంగా (Nine farm labourers Safe) బయటపడ్డారు. ఘటన వివరాల్లోకెళితే.. రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మూడు గిరిజన కుటుంబాలకు చెందిన 9మంది కౌలు రైతులు సమీప గోదావరి నదిలోని కుర్రు(పాయ)లో పత్తి చేనులో పనులు చేసేందుకు వెళ్లారు.
ఇందులో వల్లె రఘునాథ్, రంగారావు, దేవిదాస్, సహేబ్‌రావు, కొమ్రె విజయ్, డొక్కె కార్తీక్, సత్యబామ, విజయ, సునీత తమతమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాల పరిధిలోకి వస్తుంది. భారీవర్షాలకు తోడు ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో గోదావరి ఉగ్రరూపం (Godavari river in Jagtial) దాల్చింది. రైతులు పనిచేస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు.
ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిస్థితిని సమీక్షిస్తూ విషయాన్ని సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్లారు. తొలుత బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించదనే సూచనతో నిజామబాద్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు రంగంలోకి దించారు. వారు బోర్నపల్లి ప్రాంతానికి రాత్రి 7 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. రెండు బోట్ల సాయంతో రైతులు ఉన్న కుర్రు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ బోట్లలో బాధితులను గోదావరి తీరానికి సురక్షితంగా చేర్చారు. సుమారు రెండు గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమించాయి.