Amaravati, July 12: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నేడు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ మేరకు తాజా బులెటిన్ లో వివరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసరాలను ఆనుకుని ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. కాగా, తెలంగాణలో రెడ్ అలర్ట్ జాబితాను 13 జిల్లాలకు పెంచారు. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఏపీలో భారీ వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తర కోస్తా నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గోదావరికి ఈ ఏడాది ముందస్తుగానే వరదలు వచ్చాయని, దీంతో ఈ నెలలోనే 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని తెలిపారు. రేపు ఉదయానికి వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా గోదావరిలో వరద ప్రవాహం పెరగడానికి కారణమని అన్నారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని (YS Jagan orders) జగన్ చెప్పారు. ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని అన్నారు. కంట్రోల్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని చెప్పారు. కూనవరం, చింతూరుల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు... అమలాపురం, వేలూరుపాడు, వీఆర్ పురంలలో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని తెలిపారు.
సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు బాగుండాలని సీఎం సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు (pay compensation of Rs 2000 per Family) ఇవ్వాలని... తక్షణ సాయంగా ఈ డబ్బు వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. వరదల కారణంగా జరిగే నష్టాలపై రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకు తక్షణమే రూ.2కోట్ల చొప్పున నిదులు పంపిస్తున్నామని సహాయక శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు బాగుండాలని సీఎం సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, మంచి ఆహారం అందించాలని చెప్పారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అన్నారు. వరదల కారణంగా జరిగే నష్టాలపై రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. ఇది ఒడిశా, చత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.
దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగిందన్నారు. అలాగే రుతుపవన ద్రోణి తీవ్ర అల్పపీడనం మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాకాతం వరకు విస్తరించిందన్నారు. వీటి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని తెలిపారు.
దీంతో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.