Amaravati, July 12: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు (Draupadi Murmu AP Tour) వచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏపీకి చేరుకున్నారు. అనంతరం ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో (CM Jagan ) కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్ జగన్.. ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు (YSRCP Full support to Murmu) ఇస్తున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. ఈ మేరకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది.
వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’ అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని, ఓటేయాలని సీఎం జగన్ కోరారు.
ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని, జులై 18న మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తామని, మాక్‌పోలింగ్‌లో పాల్గొన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలని సభ్యులకు సూచించారు. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారని, అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను ముర్ముకు పరిచయం చేశారు సీఎం జగన్.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు. తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయం. స్వాతంత్ర్య సమరంలో ఏపీకి ఘన చర్రిత ఉంది. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత పోషించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించాము. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్ మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలి’’ అని స్పష్టం చేశారు