Telangana Rains: మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఉగ్రరూపం దాల్చిన గోదావరి, తుంగభద్రా నదులు, నిండు కుండలా హుస్సేన్ సాగర్, అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచన
Heavy Rains (Photo-ANI)

Hyd, July 12: తెలంగాణను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 14 వరకు తెలంగాణలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (Telangana Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HMD) ప్రకటించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, హనుమకొండ, మెదక్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ( Heavy rains to continue) పేర్కొంది. ఓవైపు ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.

గ‌డ‌చిన రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ‌లో ఈ సెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఈ నెల 13 (బుధ‌వారం)న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్షను వ‌ర్షాల కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యా మండలి చైర్మ‌న్ లింబాద్రి సోమ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఈ నెల 14 నుంచి జ‌ర‌గ‌నున్న ఎంసెట్ య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు ఈ నెల 13 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 13న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఉన్న‌త విద్యా మండ‌లి తెలిపింది. ఈ ప‌రీక్ష‌ను తిరిగి ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని మండ‌లి అధికారులు తెలిపారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. సీఎం కేసీఆర్ సవాల్‌కు సై అన్న బీజేపీ, కాంగ్రెస్, కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరిన ఈటల రాజేందర్

ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. తెలంగాణలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరగా, భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి భీకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు, మహారాష్ట్రలో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో గోదావరి నదికి వరద పోటెత్తడంతో పలు ఆలయాలు నీటమునిగాయి.

ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. కూకట్‌పల్లి నాలా నుంచి వస్తున్న నీరు సైతం హుస్సేన్‌‌సాగర్‌లోకి చేరుతోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. వస్తున్న నీటి ఇన్‌ఫ్లోకు... సమానంగా తూముల ద్వారా నీరు బయటకు వెళుతోంది.

తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

అటవీ ప్రాంతాలతో నిండిన జిల్లాల్లో భారీగా వర్షాలు కురియడంతో వాటి పరిధిలోని చెరువులన్నీ నిండుతున్నాయి. నీటిపారుదల శాఖ పరిధిలో 19 చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) ప్రాంతాలుండగా... అందులో అడవులు సమృద్ధిగా ఉన్న జిల్లాల్లోనే వర్షాలు పడి చెరువులు అలుగులు దూకుతున్నాయి.

అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారాయి. అలాగే హుస్సేన్‌సాగర్‌ సైతం నీటితో నిండిపోయింది.

కర్నాటక తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యామ్‌కు వరద ముంచెత్తుతోంది. మంగళవారం టీబీ డ్యామ్‌కు 87,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 1,649 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యామ్‌లో 95.314 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1630.33 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యామ్‌ సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు వరద భారీగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గేట్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తుంగభద్ర బోర్డు అధికారులు కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

శ్రీంరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి ప్రస్తుతం డ్యామ్‌కు 45,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 89,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.జలాశయంలో ప్రస్తుతం 1087.60 అడుగుల మేర నీరుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వసామర్థ్యం 90.30 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 70 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.

మూడురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో మం త్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్నిశాఖల అధికారులు, సిబ్బంది తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలి. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి’ అని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.ఎనిమిది జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన నేపథ్యం లో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు జిల్లా కేంద్రాలు, స్థానిక ప్రాంతాలను విడిచి ఎకడికీ వెళ్లొద్దని సీఎం ఆదేశాలు జారీచేశారు.

భారీ వర్షాల నేపథ్యంలో సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసింది. వరద బాధితుల సహాయ చర్యల కోసం ప్రత్యేకంగా 7997959705, 7997950008 నంబర్లు ఏర్పాటుచేసింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమించింది. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటలకు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు గిరిజన సంక్షేమశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌రెడ్డి, డీఎస్పీ శశాంక్‌రెడ్డి, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎస్సీ అభివృద్ధిశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ హనుమంత్‌నాయక్‌, డీఎస్పీ సత్యనారాయణరాజు విధులు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. వరద ఉధృతి కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వంతెనలు, జలాశయాల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, ఇతర పోలీస్‌ యంత్రాంగం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో పాల్గొంటున్నారు. వర్షాలు ఇంకా ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. వరదనీరు ప్రవహిస్తున్నప్పుడు కాజ్‌వే, కల్వర్టు, అండర్‌పాస్‌లు, చిన్న చిన్న వంతెనలపై వాహనాల మీద కానీ, నడిచి కానీ వెళ్లవద్దని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం 100కు డయల్‌ చేయాలని సూచించారు.