Hyd, July11: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో రానున్న మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ( IMD) సూచించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చెరువులు, కుంటలు అలుగెత్తి ప్రవహిస్తుండగా... మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలోని సముద్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది.
ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (heavy rains) కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
ఆసిఫాబాద్ కొమరం భీమ్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అత్యంత ఎక్కువగా పడే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ అర్బన్, రూరర్, జనగామలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పై జిల్లాలలో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిటీలో ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి నుంచి నుంచి మూడు రోజుల పాటు 34 ఎంఎంటీఎస్ రైళ్ళ సర్వీసులను నిలిపివేస్తన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో పది రైళ్ల(Trains) రద్దు అయ్యాయి. మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి. సికింద్రాబాద్- ఉందనగర్- సికింద్రాబాద్ ప్యాసింజర్ స్పెషల్, సికింద్రాబాద్- ఉందానగర్ మెము సర్వీస్, మేడ్చల్ - ఉందానగర్, ఉందానగర్ - సికింద్రాబాద్ స్పెషల్, సికింద్రాబాద్ - ఉందనగర్ - సికింద్రాబాద్ స్పెషల్, నాందేడ్- మేడ్చల్- నాందేడ్ స్పెషల్, సికింద్రాబాద్ - మేడ్చల్, మేడ్చల్ - సికింద్రాబాద్, కాకినాడ- విశాఖపట్నం- కాకినాడ పోర్టు మెము, విజయవాడ - బిట్రగుంట - విజయవాడ మధ్య రైళ్లు రద్దు అయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మళ్లీ వర్షం మొదలైంది. నాలుగవ రోజు సైతం నగరాన్ని ముసురు వదల్లేదు. గ్రేటర్ వ్యాప్తంగా మళ్లీ వర్షం మొదలైంది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సిటీలో అత్యధికంగా రాజేంద్రనగర్ లో 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్ లో 3.6, బహదూర్ పురా లో 3.5, శేరిలింగంపల్లిలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం..: శుక్రవారం నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 6.01 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 14.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 31.03 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూలై 10వ తేదీ సాయంత్రానికి 19.79 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..ఏకంగా 36.59 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ పేర్కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే 85 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది.