Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, రానున్న మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన (Hyderabad Rains) ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది.
Hyd, August 1: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన (Hyderabad Rains) ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది. వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం (heavy rain alert in state next 3-4 days) ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని, వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని (IMD forecasts ) పేర్కొంది. దీనికి తోడు ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నట్టు వివరించింది. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని మామడలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లా పెద్దమంతాల్‌లో 5.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా ఆదివారం సాయంత్రం అనేకచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా స్థిరంగా కొనసాగుతున్నది.