TS Coronavirus: తెలంగాణలో కరోనా కల్లోలం, అయినా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని తెలిపిన ప్రభుత్వం, తాజాగా 1,321 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 1,717కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య
ఒక్కరోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు (TS Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి (TS Coronavirus) చేరింది.
Hyderabad, April 4: తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,321 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు (TS Covid Deaths) కోల్పోయారు. అదే సమయంలో 293 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,140కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,02,207 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,717గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 7,923 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,886 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కొత్తగా 320 మందికి కరోనా సోకింది.
జీహెచ్‌ఎంస్‌సీతో పాటు జిల్లాలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 320 కేసులు ఉండగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 144, రంగారెడ్డిలో 121, నిజామాబాద్‌లో 96, నిర్మల్‌లో 64, సంగారెడ్డిలో 49, జగిత్యాలలో 46, కరీంనగర్‌లో 41, రాజన్న సిరిసిల్లలో 35, మహబూబ్‌నగర్‌లో 30 కేసులు రికార్డయ్యాయి.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ వచ్చింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరి స్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 85 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్ సోకడంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వ క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్(నైట్ కర్ఫ్యూ) అమలు చేస్తారని సా. 6 నుంచి ఉ. 8 వరకు షాపులు, వ్యాపార సముదాయాలు, ప్లే జోన్లు మూసి ఉంచాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ఉన్న ఓ జీవో బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. లాక్ డౌన్ ప్రచారంలో నిజం లేదన్నారు. అది ఫేక్ జీవో అని స్పష్టం చేశారు. వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి రకమైన లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని మరోసారి స్పష్టంచేశారు.
షాపులు, వాణిజ్య సంస్థలు మూసివేయాలంటూ 2021 ఏప్రిల్ 1న తన సంతకంతో జారీ చేసిన జీవో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇదీ నకిలీదని.. ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో వస్తున్న ఫేక్ వార్తలను నమ్మొద్దని సోమేష్ కుమార్ కోరారు. నా పేరుతో జీవో ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు