Hit and Run Case in Hyderabad: ర్యాష్ డ్రైవింగ్‌కు డాక్టర్ బలి, హైదరాబాద్‌లో డాక్టర్‌ను కారుతో ఢీకొట్టి పారిపోయిన యువకుడు, నిమ్స్ లో మూడు రోజుల పాటూ మృత్యువుతో పోరాటం, తలకు బలమైన గాయం కారణంగా మృతి
గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.
Hyderabad, SEP 24: మలక్ పేట హిట్ అండ్ రన్ (Hit and Run ) ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న డాక్టర్ శ్రావణి చనిపోయింది. నిమ్స్ లో (NIIMS) మూడురోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతున్న డాక్టర్ శ్రావణి (Doctor Sravani) శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. 25 రోజుల కిందటే వాళ్ల అమ్మ గుండెపోటుతో మరణించగా.. ఇప్పుడు శ్రావణి కూడా ఇలా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. హస్తినాపురం (Hasthinapuram) డెంటల్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న శ్రావణి ఈ నెల 21న స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. ఓ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రావణి కింద పడిపోగా.. కారుతో సహా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
తీవ్రంగా గాయపడ్డ శ్రావణిని నిమ్స్ లో చేర్పించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న శ్రావణి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.
ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ (CCTV) ఆధారంగా కారును గుర్తించారు. నిందితుడు ఓల్డ్ మలక్ పేటకు చెందిన 19ఏళ్ళ ఇబ్రహీంగా గుర్తించామన్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుడికి లైసెన్స్, కారుకి పేపర్లు కూడా లేవని పోలీసులు తెలిపారు.