Telangana Rains: ఎవరూ బయటకు రాకండి, రానున్న రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ
Hyd, Oct 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం (Telangana to receive heavy rains) ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇతరులు సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040 2111 1111 ను సంప్రదించొచ్చని విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం అతలాకుతులమైంది. ఆ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్ శివ గంగను వరద పోటెత్తింది. భారీ వర్షానికి థియేటర్ ప్రహరీ కూలింది. దీంతో అక్కడే పార్కు చేసిన సుమారు 50 ద్విచక్రవాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఫస్ట్ షో సినిమా చూసి బయటకి వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ప్రేక్షకులు భారీ వర్షంలో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు థియేటర్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. హాల్‌లోని కుర్చీలు నీట మునిగాయి. ఇక జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జరిగిన నష్టం గురించి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. జేసీబీతో గోడ శిథిలాలను తొలగించి వాహనాలను బయటకి తీశారు.
ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల గులాబ్ తుపాను తరువాత కూడా ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో.. ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. నిన్న సాయంత్రం జంట నగరాలను అల్లాడించింది.