Telangana Unlock: తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటకకు ప్రారంభమైన బస్సు సర్వీసులు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు బస్సుల రాకపోకలు, కర్ణాటకకు శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులు బంద్
ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు (Bus Services) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి.
Hyderabad, June 21: తెలంగాణ ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు (Interstate bus services) ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు (Bus Services) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్‌డౌన్ (Curfew)సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి (TS Border) బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు.
ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్‌ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు.
కర్ణాటకకు కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బస్సులను నడపనుంది. బెంగళూరు మినహా కర్ణాటకలోని అన్ని ప్రాంతాలకు సర్వీసులను అందుబాటులో ఉంచుతుంది. కర్ణాటకలో వారాంత కర్ఫ్యూ దృష్ట్యా సర్వీసులను నిలిపివేయనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు బస్సులను బంద్ చేయనుంది.