Bonalu 2021: భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి షురూ, తొలిగా ప్రారంభం అయిన గోల్కొండ బోనాలు, వచ్చే నెల 8వ తేదీ వరకు జగదాంబిక మహంకాళి అమ్మవారి ఉత్సవాలు, ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా నేటి నుంచే..
గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కాగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు (Golconda Jagadamba Mahankali Bonalu 2021 ) చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది.
Hyderabad, july 11: గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు (Golkonda Bonalu 2021) ప్రారంభం అయ్యాయి. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కాగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు (Golconda Jagadamba Mahankali Bonalu 2021 ) చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది.
అలాగే ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం (Mahankali Bonalu 2021) కూడా ఆదివారమే ప్రారంభమయింది. ఆషాఢ మాసంలో మొత్తం తొమ్మిది పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇవాళ ప్రారంభమైన ఆషాఢబోనాలు వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. లంగర్ హౌజ్‌లో గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని బోనాల జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ జరుగుతోందని అన్నారు. భాగ్యనగరంలోని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ బోనాలు జరుపుకోవాలని మంత్రి తలసాని సూచించారు.
ఎంతో వైభవంగా జరిగే గోల్కొండ బోనాల ఉత్సవాలతోనే నగరంలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. గోల్కొండ కోటపై కొలువు దీరిన అమ్మవారిని చోటాబజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారిని అలంకరించుకొని భారీ ఊరేగింపు నడుమ ఆదివారం కోటపైకి తీసుకెళ్లి ప్రతిష్టిస్తారు. పోతరాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగిపోతాయి. కోట పైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే తలపిస్తుంది. నగీనాబాగ్ నుంచి భక్త రామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తుల అమ్మవారిని చూసి తరిస్తారు.
మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెలను కూడా మొదటి పూజలో సమర్పించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయిన ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి జగదాంబ అమ్మవారు చేరుకోనుంది. ఈ నెల 18 న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజ అమ్మవార్లతో పాటు వివిధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు.
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు పూజల వివరాలు
గోల్కొండ బోనాలు.. తొమ్మిది పూజలు
మొదటి పూజ– 11వ తేదీ ఆదివారం
రెండవ పూజ–15న గురువారం
మూడవ పూజ–18న ఆదివారం
నాల్గవ పూజ– 22న గురువారం
ఐదవ పూజ–25న ఆదివారం
ఆరవ పూజ–29న గురువారం
ఏడవ పూజ–1 ఆగస్టు ఆదివారం
ఎనిమిదవ పూజ–5 ఆగస్టు గురువారం
తొమ్మిదవ చివరి పూజ–8 ఆగస్టు ఆదివారం ఈ వేడుకలతో బోనాలు ముగుస్తాయి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవ వివరాలు
12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అమ్మవారి ఘటం ఒక్కో రోజు ఒక ప్రాంతంలో తిరుగుతుంది. ఇంటింటికి వెళ్లి భక్తుల పూజలు అందుకుంటుంది.
23వ తేదీ బోయిగూడ ప్రాంతానికి వెళ్లి 24వ తేదీ రాత్రి 7గంటలకు దేవాలయానికి తిరిగి వస్తుంది.
25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి.
26వ తేదీన రంగం కార్యక్రమం.
పాతబస్తీలో ఈ నెల 23న కలశ స్థాపనతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం.
25న పాతబస్తీలో ఘట స్థాపన ఊరేగింపు, ఆగస్టు 1న బోనాల సమర్పణ. 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు.
ఆగస్టు 3వ తేదీన అమ్మవారికి సమర్పించే మారు బోనంతో ఈసారి బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి.