Houston, July 11: గగనపు వీధిలో తెలుగు కీర్తి పతాకం మరి కొన్ని గంటల్లో రెపరెపలాడబోతున్నది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) నేడు అంతరిక్షంలోకి (Indian-origin Shirisha Bandla) ప్రయాణించనుంది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది. అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి ఈ ప్రయోగం ఉంటుందని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించిన శిరీష (Sirisha Bandla) హ్యూస్టన్‌లో పెరిగారు.
అక్కడే విద్యనభ్యసించి ఏరోనాటికల్ ఇంజనీర్‌గా (aeronautical engineer) పనిచేస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ వ్యవహారాలు-పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఆమె ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాల్యం నుంచీ వ్యోమగామి కావాలనుకున్న శిరీష, ఎట్టకేలకు ఆదివారం తన కలను నెరవేర్చుకోనుండటం విశేషం. ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం తనకెంతో సంతోషంగా ఉందని శిరీష ట్విటర్‌లో పేర్కొన్నారు.
Here's Sirisha Bandla Tweet
I am so incredibly honored to be a part of the amazing crew of #Unity22, and to be a part of a company whose mission is to make space available to all. https://t.co/sPrYy1styc
— Sirisha Bandla (@SirishaBandla) July 2, 2021
కల్పన చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత రోదసిలోకి ప్రయాణించనున్న మూడవ భారతీయ మహిళగా శిరీష నిలవనున్నారు. ఈ ప్రయాణంలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్‌సన్ కూడా ఉండటం గమనార్హం. ఈ ప్రయోగం విజయం అనంతరం.. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలనేది వర్జిన్ సంస్థ (Virgin Galactic’s SpaceShip) యోచనగా తెలుస్తోంది.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘వీఎస్‌ఎస్ యూనిటీ-22’ అనే మానవసహిత వ్యోమనౌకను రోదసీలోకి నేడు పంపిస్తోంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే న్యూ మెక్సికో నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు (అమెరికా కాలమానం) ‘వీఎస్‌ఎస్ యూనిటీ–22’ అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది. వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాస్‌నన్ (Sir Richard Branson), శిరీషతోపాటు మరో నలుగురు హ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్లనున్నారు. భూమి నుంచి 15 వేల మీటర్ల ఎత్తుకు వీఎంఎస్ ఈవ్ ప్రత్యేక విమానం వెళ్లనుంది. అందులోనే వ్యోమనౌక వీఎస్‌ఎస్ యూనిటీ-22 ఉంటుంది.