Sirisha Bandla with her fellow crew members | Photo: Twitter

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ అడుగుపెట్టబోతున్నారు. జూలై  11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తోన్న తొలి తెలుగు మూలాలున్న మహిళ ఈమే కావడం విశేషం.

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్‌ 25న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ లైసెన్సు జారీ చేసింది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్‌ఫ్లైట్‌ బయల్దేరనుంది.

వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది, అయితే ఈ ప్రయాణంలో మనుషుల్ని కూడా పంపించడం ఇదే తొలిసారి. జూలై 11న బయలుదేరే వ్యోమనౌకలో ఇద్దరు పైలెట్లతో పాటు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, మరియు సంస్థ యొక్క చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్ స్ట్రక్టర్ అయిన బెత్ మోసెస్- ఈయన ప్రయోగంలో టార్గెట్ల అమలును పర్యవేక్షిస్తారు, అలాగే లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కోలిన్ బెన్నెట్ క్యాబిన్ వాతావరణం, అవసరమయ్యే సామాగ్రి మరియు బరువు లేమి అనుభవాన్ని అంచనా వేస్తారు. వీరితో పాటు శిరీష బండ్ల సంస్థ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ప్రభుత్వ వ్యవహారాలు మరియు పరిశోధన కార్యకలాపాల బాధ్యతను పర్యవేక్షించనున్నారు.

Watch Video:

వర్జిన్ తన వెబ్‌సైట్‌లో, అలాగే ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు యూట్యూబ్ పేజీలలో స్పేస్ ఫ్లైట్ యొక్క గమనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జూలై 11న ఉదయం 9 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే వాతావరణం మరియు సాంకేతిక పరిస్థితులను బట్టి సమయాల్లో మార్పులు ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఈ మిషన్ విజయవంతమైతే, తర్వాత కాలంలో అందరికీ అంతరిక్షయానం చేయటానికి టికెట్ల అమ్మకాలను ప్రారంభించాలని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ యోచిస్తుంది.

ప్రపంచ అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే బ్రిటన్ కు చెందిన అపర కుబేరుడు తమ సొంత స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయబోతున్నారు. ఈ వ్యవహారాన్ని 'కుబేరుల అంతరిక్ష పోటీ'గా గ్లోబల్ మీడియా అభివర్ణిస్తుంది.