Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Superstar Mahesh Babu (Photo-X)

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఆంధప్రదేశ్‌లో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం పట్టణాలు మునుపెన్నడూ ఎరుగని వరదలతో తల్లడిల్లిపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ సెలబ్రిటీలు భారీ ఆర్థిక విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు కూడా చేరాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తాను అభ్యర్థిస్తున్నానని, మనమంతా ఈ సంక్షోభాన్ని అధిగమించి మరింత బలంగా పుంజుకోవాలని అభిలాషిస్తున్నట్టు ప్రిన్స్ పేర్కొన్నాడు.