Sheep Distribution in Telangana: తెలంగాణలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో లాంఛనంగా ప్రారంభించనున్న పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani) లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
Hyderabad, July 28: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీకి (Sheep Distribution in Telangana) తెలంగాణ పశు సంవర్ధకశాఖ శ్రీకారం చుట్టనున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani) లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాష్ట్రమంతటా గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది.
కాగా ఈ కార్యక్రమంపై ఇటీవలే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సంగతి విదితమే. రెండోవిడత పంపిణీని (distribution of the second batch of sheep) వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన ఆరువేల కోట్ల రూపాయలను కూడా సీఎం మంజూరుచేశారు. రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.81 లక్షల మంది గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి ఒక యూనిట్ (21) గొర్రెలను పంపిణీ అందిస్తారు.
బహిరంగ మార్కెట్లో గొర్రెల ధర పెరిగిన నేపథ్యంలో ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 21 గొర్రెలు రావడం లేదనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. దీంతో ప్రస్తుత గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు. మొదటి విడత పంపిణీలో రూ.4702 కోట్లతో 3.76 లక్షల మందికి గొర్రెల పంపిణీ జరిగింది. మొదటి విడత వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. గొర్రెల సంఖ్య భారీగా పెరిగింది. గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఇదే పంథాను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండోవిడత పంపిణీకి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వేదికగా ఎంచుకున్నారు.
బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో 5 వేల మంది గొల్ల కురుమల లబ్ధిదారులతో భారీ సభ ఏర్పాటు చేసి గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 242 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో 29,813 మంది సభ్యులున్నారు. వీరికి రూ.21.10 కోట్లతో మొదటి విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం 2017లో చేపట్టింది. ఒక్కో యూనిట్‌లో 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు.
గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం కాక ముందు కరీంనగర్ జిల్లాలో 4.10 లక్షల గొర్రెలు మాత్రమే ఉండేవి. తర్వాత అవి 6.93 లక్షలకు చేరుకున్నాయి. జిల్లాలో ఇపుడు 7.30 లక్షలకుపైగా గొర్రెలు ఉన్నట్లు అంచనా. రెండో విడత పంపిణీ జరిగితే మరో 2.82 లక్షలకు పైగా గొర్రెలు జతవుతాయి జమ్మికుంట సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని 500 మంది లబ్ధిదారులకు మంత్రులు గొర్రెలు పంపిణీ చేస్తారు. రెండో విడతలో జిల్లాలో 13,439 యూనిట్లు మంజూరు కాగా, హుజూరాబాద్ నియోజకవర్గానికి వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్ మండలాన్ని కలుపుకుని 4,791 యూనిట్లు వచ్చాయి.