Shadnagar Road Accident: అదుపుతప్పి..పల్టీలు కొట్టి..లారీని ఢికొట్టిన కారు, ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, షాద్‌నగర్ బైపాస్ వద్ద విషాద ఘటన
హైదరాబాద్-బెంగళూరు జాతియ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్ నగర్ బైపాస్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad, Feb 28: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Shadnagar Road Accident) చోటు చేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతియ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్ నగర్ బైపాస్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మలక్‌పేట వాసులుగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
తెలంగాణ రాజధాని నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా గానీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. నిన్న ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మృతిచెందాడు. రెడ్ సిగ్నల్ జంప్ చేసి బస్సుకు అడ్డంగా వెళ్లి విగతజీవిగా మారాడు. ఈ ఘటన రామచంద్రాపురం(ఆర్‌సీ పురం)లో (RC Puram Road Accident) చోటుచేసుకుంది.
స్కూటీపై రాంగ్ రూట్‌లో వస్తున్న బైకర్‌ను ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad traffic police) ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘ఇంకెంత కాలం ఇలా? ప్రమాదాల బారిన పడతారు’’ అంటూ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక సిగ్నల్ జంప్ చేసిన రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో మరొకరు మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. చంద్రయాణగుట్ట నుంచి వస్తున్న స్వరాజ్ మజ్డా వాహనం బంజారాహిల్స్ వెళ్తుంది. కాటేదాన్ నుంచి వస్తున్న ఆటో చంద్రయాణగుట్ట వైపు వెళ్తుంది. ఈ ఆటోలో డ్రైవర్ అర్మాజ్(19)తో పాటు మహ్మద్ గౌస్(20) ప్రయాణిస్తున్నాడు. ఈ రెండు వాహనాలు దుర్గానగర్‌కు వచ్చే సమయానికి రెడ్ సిగ్నల్ పడింది.
ఇరువురు డ్రైవర్లు నిర్లక్ష్యంగా సిగ్నల్ జంప్ చేయడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు గాయపడ్డారు. స్వరాజ్ మజ్డా డ్రైవర్ దావూద్(55) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ డ్రైవర్ అర్మాజ్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు.
మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు