Save Telangana RTC: కేంద్రాన్ని కలిసే యోచనలో ఆర్టీసీ జేఏసీ, హైకోర్టులో మరోసారి ఆర్టీసీ అంశంపై విచారణ, కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, విధుల్లోకి చేర్చుకోవాలని అభ్యర్థన
దీనిపై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు.....
Hyderabad, November 25: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె (TSRTC Strike) విరమిస్తామని ప్రకటించి 5 రోజులు కావస్తున్నా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో 52వ రోజూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సేవ్ ఆర్టీసీ (Save RTC) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించినా, డిపో అధికారులు అనుమతించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే డిపోల ఎదుట బైఠాయిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేషరతుగా విధుల్లోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.
ఇటు, ఆర్టీసీ ఐకాస (TSRTC JAC) నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు హైదరాబాద్, విద్యానగర్ లో గల ఎంప్లాయిస్ యూనియన్ (EU) కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. సమ్మె విరమిస్తామని చెప్పి, ఉద్యోగంలో చేరేందుకు ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం పట్ల నేతలందరూ సమాలోచనలు చేశారు. రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి? అని విపక్ష సభ్యుల వద్ద సూచనలు తీసుకున్నారు. కేంద్రంలోని పెద్దలను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్లు కోరినట్లు సమాచారం.
ఈ సమావేశం అనంతరం అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరోసారి అభ్యర్థించారు.
మరోవైపు, ఎలాంటి అర్హత, అనుభవం లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారని హైకోర్టు (High Court of Telangana) లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు, నెలరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేసింది.
అలాగే ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ జీతాల అంశం కూడా ఈరోజు హైకోర్టులో చర్చకు వచ్చింది. కాగా, ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని ఆర్టీసీ యాజమన్యం తరఫు న్యాయవాది గడువు కోరారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ, ఇకపై ఎలాంటి గడువులు తీసుకోకుండా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను బుధవారానికి వాయిదావేసింది.