Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, ఎంపీ అవినాష్ రెడ్డిపై అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Hyd, Mar 10: వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటివరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో మంగళవారం కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, ఎంపీ అవినాష్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. గతంలో రెండు సార్లు విచారణలో ఆడియో, వీడియో రికార్డులు చేశారా అని హైకోర్టు.. సీబీఐని ప్రశ్నించింది. ఏ 4గా ఉన్న దస్తగిరి బెయిల్‌పై సీబీఐ అభ్యంతరం తెలపలేదని హైకోర్టుకు అవినాష్ తరఫు న్యాయవాది తెలిపారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని అభియోగాలు ఉన్నాయన్న తెలంగాణ హైకోర్టు.. ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలంది.
కేసు విచారణలో భాగంగా ఆడియో, వీడియో రికార్డుల హార్డ్ డిస్క్‌ను సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టుకు తీసుకొచ్చామన్నారు. కేసుకు సంబంధించిన హార్డ్ డిస్క్, కేసు ఫైల్ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి తెలిపారు. సోమవారం సీల్డ్ కవర్‌లో అవినాష్ వివరాలు, హార్డ్ డిస్క్ ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.
అప్పటివరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. అవినాష్‌రెడ్డి.. సాక్షా? లేక నిందితుడా? అని సీబీఐని ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్‌ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సోమవారం వరకు అవినాష్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం.. అవసరమైతే ఆయన మంగళవారం మరోసారి కోర్టుకు హాజరవుతారని తెలిపింది.
ఇక ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ నేడు ముగిసింది. ఆయనను మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీబీఐ విచారించింది. అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండుసార్లు ఆడియో, వీడియో రికార్డు చేయాలని అడిగాను. వాళ్లు పట్టించుకోకపోతే హైకోర్టును ఆశ్రయించాను. ఈ కేసులో సీబీఐ విచారణ తప్పుదోవపడుతోంది. తప్పుడు సాక్ష్యాలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు’’ అని అన్నారు.
‘‘నా తరఫున వివేకా ఇంటింటికీ ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. కట్టుకథను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు. నాపై ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగా ఉన్నా.. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేస్తా. విచారణ సమయంలో ఒక ల్యాప్‌టాప్ మాత్రమే పెడుతున్నారు. ల్యాప్‌టాప్‌లో రికార్డింగ్ చేస్తున్నారో లేదో తెలియదు.
సీబీఐ వాళ్లే మా సోదరికి సమాచారం ఇస్తున్నారు. కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను లంచ్‌మోషన్ వేసిన వెంటనే ఆమెకు సీబీఐ సమాచారం ఇస్తుంది. దీని వెనుక పెద్ద కుట్రలున్నాయి. కంచె చేనుమేసే విధంగా సీబీఐ వ్యవహరిస్తోంది’’ అని అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘2006 నుంచి ఓ మహిళతో వివేకాకు సంబంధం ఉంది. షేక్ షహన్‌షా అనే అబ్బాయి వారికి పుట్టాడు. వివేకా ఇంట్లో డాక్యుమెంట్లు కోసం కొందరు వెతికారు. ఆస్తి తగాదాల కోసమే హత్య జరిగినట్లు భావిస్తున్నా. ఈ కేసులో సీబీఐ అన్ని కట్టుకథలు అల్లుతోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖను మధ్యాహ్నం వరకు సునీత భర్త ఎవరికీ ఇవ్వలేదు. నన్న ఘటనా స్థలానికి వెళ్లమని చెప్పిందే వాళ్లు లేఖ విషయం బయటకు చెప్పకపోవడవం పెద్ద నేరం’’ అని అవినాష్‌రెడ్డి అన్నారు.