Hyd, Mar 9: వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కడప ఎంపీ ( MP Avinash Reddy) కోరారు.
తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పిటిషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పలుమార్లు కోరినా సీబీఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదు. 160 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు ,చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి కోరారు.
వివేకా హత్య కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది’’ అని ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.
సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లోకేషన్ చూపి సీబీఐ నన్నువేధిస్తుంది. స్పాట్‌లో దొరికిన లేఖపై సీబీఐ దర్యాప్తు చేయటం లేదు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్‌షీట్‌లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తుంది. కేసులో నిజానిజాలను సీబీఐ పట్టించుకోవడం లేదు. నిష్పక్షపాతమైన విచారణ జరిగేలా ఆదేశించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు.