Chandrayaan 3 Mission Update: కీలకమైలురాయి దాటిన చంద్రయాన్-3, భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-3, ఆగస్ట్ 24 న ల్యాండింగ్ అయ్యే అవకాశం
ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.
New Delhi, Aug 05: చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan 3) తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC)’ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ క్రమంలోనే.. మొదటి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 6న రాత్రి 11 గంటల సమయంలో చేపట్టనున్నట్లు తెలిపింది. ఇలా దశలవారీగా కక్ష్యను తగ్గిస్తూ.. వ్యౌమనౌకను చంద్రుడికి మరింత చేరువ చేయనుంది.
‘చంద్రయాన్-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే శనివారం విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. ఇక క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ.. ‘చంద్రయాన్-3’ని జాబిల్లికి 100 కిలోమీటర్ల ఎత్తులోకి చేర్చనున్నారు. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.