#FacebookDown: రెండోసారి ఫేస్‌బుక్ డౌన్, క్షమాపణలు కోరిన యాజమాన్యం, ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించిన నెటిజన్లు
దీంతో శుక్రవారం కొద్ది గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ సేవలు నిలిచిపోయాయి. అయితే సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం యథావిధిగా సేవలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది.
New Delhi, October 9: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో రెండో సారి సాంకేతిక సమస్య (Facebook, WhatsApp, Instagram Down) తలెత్తింది. దీంతో శుక్రవారం కొద్ది గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ సేవలు నిలిచిపోయాయి. అయితే సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం యథావిధిగా సేవలు కొనసాగుతున్నాయని సంస్థ వెల్లడించింది. వినియోగదారులను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలిపింది.
కాన్ఫిగరేషన్ మార్పుల్లో జరిగిన పొరబాటు కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లకు ఫేస్‌బుక్‌కు చెందిన కొన్ని యాప్‌ల సేవలు కొంతసేపు నిలిచిపోయాయి. కొంతమంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీడ్ రాలేదు. మరికొందరికి మెసెంజర్ నుంచి సందేశాలు వెళ్లలేదు. దీంతో ఆయా యూజర్లు ట్విటర్ వేదికగా సమస్యను బయటపెట్టడమే గాక.. ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో కంపెనీ స్పందించి క్షమాపణలు తెలిపింది.
రెండు గంటల పాటు మా యాప్ సేవల్లో అంతరాయం కలిగినందుకు గానూ యూజర్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. సమస్యను పరిష్కరించాం. ఇప్పుడు సేవలు సాధారణ స్థితికి వచ్చేశాయి. క్లిష్టపరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వినియోగదారులకు కృతజ్ఞతలని కంపెనీ తెలిపింది. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఫేస్‌బుక్‌కు చెందిన యాప్ సేవలు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి (Users After Global Outage For Second Time in a Week,) కావడం గమనార్హం.
గత సోమవారం ఇదే కాన్ఫిగరేషన్ మార్పుల సమస్య కారణంగా దాదాపు ఆరు గంటల పాటు ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్‌బుక్‌పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘చూస్తుంటే ఫేస్‌బుక్ వారానికి మూడు రోజులే పనిచేస్తున్నట్లుంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.