Trivandrum, FEB 05: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడ్డాడు. శబ్దం విన్న అతడి భార్య పరుగున బయటకు వచ్చింది. 40 అడుగుల లోతున్న బావిలో భర్త పడిపోవడాన్ని గమనించింది. సహాయం కోసం కేకలు వేసింది. ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో బావిలోకి దిగింది. ఎంతో ధైర్యంతో భర్తను కాపాడింది. (Wife Saves Husband Fallen in Well) కేరళలోని పిరవోంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం 64 ఏళ్ల రమేసన్ నిచ్చెన సహాయంతో చెట్టుపై ఉన్న మిరియాల గింజలను ఒలుస్తున్నాడు. అయితే నిచ్చెన అదుపుతప్పడంతో సమీపంలో ఉన్న ఇంటి బావిలో అతడు పడ్డాడు.
కాగా, పెద్ద శబ్దం విన్న అతడి భార్య అయిన 56 ఏళ్ల పద్మ వెంటనే బయటకు వచ్చింది. భర్త బావిలో పడటాన్ని ఆమె గమనించింది. చుట్టుపక్కల వారి సహాయం కోసం కేకలు వేసింది. బావిలో ఐదు అడుగుల లోతులో నీరు ఉండటంతో భర్తకు పొంచి ఉన్న ప్రమాదంపై ఆందోళన చెందింది. ధైర్యం చేసి తాడు సహాయంతో ఆ బావిలోకి దిగింది. భర్తను పట్టుకుని సహాయం కోసం ఎదురుచూసింది.
మరోవైపు పద్మ కేకలు విన్న స్థానికులు ఆ బావి వద్దకు చేరుకున్నారు. ఐదు అడుగుల లోతున్న నీటిలో తాడు సహాయంతో భర్తను గట్టిగా పట్టుకుని ఉన్న ఆమెను చూశారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది 40 నిమిషాల్లో అక్కడకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆ భార్యాభర్తలు ఆ బావిలోనే ఉన్నారు.
కాగా, ఫైర్ సిబ్బంది బావిలోకి దిగాల్సిన అవసరం లేదని పద్మ చెప్పింది. వలను లోపలకు దింపాలని కోరింది. దీంతో వల సహాయంతో తొలుత ఆమె భర్తను పైకి తీశారు. ఆ తర్వాత పద్మ ఆ బావి నుంచి బయటకు వచ్చింది. తాడుతో బావిలోకి దిగడం వల్ల చేతులకు స్వల్ప గాయాలైన పద్మతోపాటు ఆమె భర్తను వెంటనే ఆసుపత్రికి తరలించారు.