Mark Zuckerberg, CEO, Facebook

New Delhi, October 5: వాట్సాప్, ఫేస్‌బుక్ సేవలు అందుబాటులోకి (Facebook, WhatsApp Resume) వచ్చాయి. దాదాపు 6 గంటల తర్వాత వాట్సాప్ సేవలను పునరుద్ధరించారు. సోమవారం రాత్రి 9 గంటల 9 నిముషాలకు వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ఈ సోషల్ మీడియా నెట్ వర్క్ సేవలు బంద్ అయ్యాయి. వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ సేవలు, 4 గంటల సమయంలో వాట్సాప్ (WhatsApp ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. తమ సేవలు పునరుద్ధరిస్తున్నామని రాత్రి 9:30 గంటల సమయంలోనే పేస్ బుక్ ప్రకటించినా.. ఈ సేవలు అందుబాటులోకి రావడానికి సుమారు 6 గంటలకుపైగా సమయం పట్టింది. సోమవారం రాత్రి 9 నుంచి ఆ మూడు యాప్‌లు డౌన్‌ అయ్యాయి. దీంతో వాటిని నిత్యం వినియోగించే కోట్లాది మంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

దీనిపై చాలామంది నెటిజన్లు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదుల వర్షాన్ని కురిపించారు. దీంతో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కంపెనీలు ట్విటర్‌లో స్పందించాయి.‘‘మా యాప్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌ను వినియోగించడంలో ఇబ్బంది కలుగుతోందని కొందరి నుంచి ఫిర్యాదులు అందాయి. సేవలను పునరుద్ధరించడంపైనే ప్రస్తుతం మేం పనిచేస్తున్నాం. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నాం’’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి యాంటీ స్టోన్‌ రాత్రి 9 గంటల 37 నిమిషాలకు ట్వీట్‌ చేశారు.

209 రోజుల తర్వాత అత్యంత తక్కువగా కేసులు, దేశంలో తాజాగా 18,346 మందికి కరోనా, ఆందోళన కలిగిస్తున్న మరణాలు

ఈ ప్రకటన వెలువడిన అర్ధగంట లేదా గంటలోగా సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అంతా భావించారు. కానీ రాత్రి ఒంటి గంట దాటాక కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తెరుచుకోలేదు. ఆ సమయానికి... ఫేస్‌బుక్‌ యాప్‌ను తెరిస్తే ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగైన్‌’ అని సందేశం వచ్చింది. వాట్సాప్‌లో మెసేజ్‌ను టైప్‌ చేసి సెండ్‌ చేస్తే బఫరింగ్‌ కొనసాగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచే ప్రయత్నం చేస్తే.. ‘కుడ్‌ నాట్‌ రిఫ్రెష్‌ ఫీడ్‌’ అనే సందేశం ప్రత్యక్షమైంది. ఫేస్ బుక్ డౌన్ కావడంతో జుకర్ బర్గ్ యూజర్లకు సారీ చెప్పాడు. అంతరాయానికి మన్నించండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

వెబ్‌ సేవలను పర్యవేక్షించే ‘డౌన్‌ డిటెక్టర్‌.కామ్‌’ వెబ్‌సైట్‌.. వినియోగదారుల నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాట్సాప్ కు సంబంధించిన 9000 క్రాష్‌ రిపోర్టులు, ఇన్‌స్టాగ్రామ్‌పై 8000 క్రాష్‌ రిపోర్టులు, ఫేస్‌బుక్‌పై 4000 క్రాష్‌ రిపోర్టులు వచ్చాయని వెల్లడించింది. వెబ్‌సైట్‌, యాప్‌, సర్వర్‌ కనెక్షన్‌లకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మూడు యాప్‌లు మొరాయించి ఉండొచ్చని ‘డౌన్‌ డిటెక్టర్‌’ వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీలను తెరిచే ప్రయత్నం చేయగా ‘డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఎర్రర్‌’ (డీఎన్‌ఎస్‌ ఎర్రర్‌) అని చూపించిందని ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ అనేది వినియోగదారులను వారు కోరిన వెబ్‌ చిరునామాకు చేర్చే సాంకేతిక వ్యవస్థ అని పేర్కొంది. బహుశా ఇది విఫలమైనందు వల్లే ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీ తెరుచుకోకపోయి ఉండొచ్చని అంచనా వేసింది.

ఫేస్‌బుక్ మెసెంజర్ ఫోటోలు ఫోన్‌లో సేవ్ కాకుండా చేసుకోవచ్చు, మీ ఫోన్ స్పేస్ తగ్గించుకోవచ్చు, ఈ చిట్కాల ద్వారా మీ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు సేవ్ కాకుండా సెట్ చేసుకోండి

తమ వెబ్‌సైట్‌, యాప్‌లు, ఇతర ప్రోడక్ట్స్‌ ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలిపేందుకు ఫేస్‌బుక్‌ ప్రత్యేకమైన ‘స్టేటస్‌’ పేజీని నిర్వహిస్తుంటుంది. మొత్తం వెబ్‌సైటే డౌన్‌ అయిన నేపథ్యంలో ‘ఫేస్‌బుక్‌ స్టేటస్‌’ పేజీ నుంచి వినియోగదారులకు సందేశాలు పంపే వీలు కూడా లేకుండాపోయింది. దీంతో ట్విటర్‌ వేదికగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవలకు అంతరాయంపై ఆయా కంపెనీలు ట్విటర్‌ వేదికగా ప్రకటనలు చేయడంపై నెటిజెన్లు స్పందించారు. ‘ఆ మూడింటికి ఏమైందో చూడటానికి అందరూ ట్విటర్‌కు వస్తున్నారహో’ అని కొందరు.. ‘చివరకు ట్విటరే నిలబడింది.. వాళ్లంతా డౌన్‌’ అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. తమ కామెంట్లను ప్రతిబింబించే ఫొటోలను జోడించి ట్వీట్లు చేశారు.

ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్‌ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్‌ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్‌ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది.

సెప్టెంబర్‌ మధ్య నుంచి ఫేస్‌బుక్‌ స్టాక్‌ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్‌బుక్‌ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్‌. ప్రస్తుతం 120.9 బిలియన్‌ డాలర్లతో బిల్‌గేట్స్‌ తర్వాత రిచ్‌ పర్సన్స్‌ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో మార్క్‌ జుకర్‌బర్గ్‌ నిలిచాడు.

అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌(డీఎన్‌ఎస్‌).. ఇంటర్నెట్‌కు ఫోన్‌ బుక్‌ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్‌ గేట్‌వే ప్రోటోకాల్‌)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్‌లోడ్‌ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్‌బుక్‌ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్‌బుక్‌, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్‌బుక్‌ ఉద్యోగుల యాక్సెస్‌ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌ హెడ్‌ ఆఫీస్‌ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది.