Jio 5G Service to Launch in India: తక్కువ ధరకే జియో 5జీ, 2021లో ఇండియాకు 5జీ సేవలను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ, అతి తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్
ఇండియాలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధంలో తీసుకువస్తున్నట్లు (Jio 5G Service to Launch in India) వెల్లడించారు.
రిలయన్స్ జియో అధినేత ముకేష్ అంబానీ 5జీపై కీలక ప్రకటన చేశారు. ఇండియాలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధంలో తీసుకువస్తున్నట్లు (Jio 5G Service to Launch in India) వెల్లడించారు. మంగళవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. జియో అందించే 5జీ సేవలు (Jio to launch 5G services) మోదీ సర్కార్ ఆత్మనిర్బర్ భారత్ విధానానికి ఓ సాక్షీభూతంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ముకేశ్ అన్నారు. దేశంలో 5జీ సేవలతోపాటు గూగుల్‌తో కలిసి అతి తక్కువ ధరకు ఆండ్రాయిడ్ ఫోన్‌ను తీసుకొచ్చే ఆలోచనలో కూడా జియో ఉంది.
దేశంలో 5జీ సేవలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి విధాన నిర్ణయాలు అవసరమని ముకేశ్ చెప్పారు. వచ్చే ఏడాదిలో బడ్జెట్ ధరకే 5జి సేవలు అందిస్తామని తెలిపారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన నెట్‌వర్క్, హార్డ్‌వేర్, సాంకేతిక పరికరాలతోనే జియో తన 5జీ సేవలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
5జీ సేవలు అందించడానికి చాలా రోజుల కిందటి నుంచే జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం శామ్‌సంగ్, క్వాల్‌కామ్ కంపెనీలతో జియో కలిసి పని చేస్తోంది. స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జీ సేవలు అందించే దిశగా జియో పని చేస్తుందని జులైలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ముకేశ్ వెల్లడించారు. డిజిటల్ ప్రపంచంలో 30 కోట్ల మంది భారతీయులు ఇప్పటికీ 2జి టెక్నాలజీలో ఊన్నారని, వారు భారతదేశ డిజిటల్ ఎకానమీలో చేరడానికి, దాని నుండి ప్రయోజనం పొందటానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ముకేష్ అంబానీ ప్రభుత్వాన్ని కోరారు.
30 కోట్ల మంది భారతీయులను 2జి నుండి విడిపించి స్మార్ట్‌ఫోన్‌లకు మారే విధానాన్నిరూపొందించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌కు 30కి పైగా దేశాల నుండి 210 మంది జాతీయ, అంతర్జాతీయ స్పీకర్లు, 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఐఎంసి 2020లో వివిధ మంత్రిత్వ శాఖలు, టెలికాం కంపెనీల సిఇఓలు, గ్లోబల్ సిఇఓలు, 5-జి టెక్నాలజీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), డేటా అనలిటిక్స్, క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్, సైబర్-సెక్యూరిటీ నిపుణులు పాల్గొంటారు.
జియో ప్లాట్‌ఫాంలు దాని డిజిటల్ లక్ష్యాలను సాధించడానికి ఈ ఏడాదిలో కేవలం నాలుగు నెలల్లో గూగుల్ ఇంక్, ఫేస్‌బుక్ వంటి పెట్టుబడిదారుల నుండి 1.52 ట్రిలియన్లను సేకరించాయి. క్వాల్కమ్ ఇంక్ పెట్టుబడి విభాగమైన క్వాల్కమ్ వెంచర్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.15% వాటా కోసం రూ.730 కోట్లు పెట్టుబడి పెట్టింది