
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనున్నది. అత్యంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (Reliance Jio planning to sell 5G smartphones) త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నది. జియో 5జీ స్మార్ట్‌ఫోన్ (Jio 5G Smartphone) కేవలం రూ.2500 నుంచి రూ. 5000లోపే ఉంటుందని సమాచారం. దీనిపై జియో అధికారికంగా స్పందించనప్పటికీ ఆ సంస్థ అధికారి ఒకరు ఈ వార్తను ధృవీకరించారు. అయితే, మన దేశంలో ఇంకా 5జీ సేవలు ప్రారంభం కాలేదు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 5జీ సేవలు మొదలు కావటానికి ఇంకా రెండేండ్లకు పైగానే సమయం పట్టవచ్చు. కాగా జియో సొంతంగా 5జీ నెట్‌వర్క్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నది. 5జీ నెట్‌వర్క్ పరికరాల టెస్టింగ్ కోసం 5జీ స్పెక్ట్రంను కేటాయించాలని జియో కోరినప్పటికీ కేంద్ర టెలికం శాఖ స్పందించలేదు.
దేశంలో జియో సంస్థ కేవలం నాలుగేండ్లలోనే 40 కోట్ల వినియోగదారులను సంపాదించుకొని ప్రపంచ రికార్డు సృష్టించింది. జియో వచ్చిన తర్వాతే దేశంలో 4జీ వీవోఎల్టీఈ సేవలు ఊపందుకున్నాయి. రూ.1500 రిఫండబుల్ డిపాజిట్‌తో కస్టమర్లకు 4జీ స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా అందించిన ఘనత కూడా జియోదే. తాజాగా ఆ సంస్థ 5జీపై కన్నేసింది. ఇదిలా ఉంటే భారత్‌ను 2జీ ఫ్రీ దేశంగా తీర్చేదిద్దడమే తమ లక్ష్యమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ కంపెనీ ఇటీవల జరిగిన 43వ వార్షికోత్సవంలో ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే.