Hyd, Oct 3: దుబాయ్ వేదికగా నేటి నుండి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించగా గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఇవాళ్టి నుండి మహిళల టీ20 ప్రారంభం కానున్న నేపథ్యంలో గూగుల్ డూడుల్ ఆకట్టుకుంటోంది. మెగా టోర్నీ ప్రారంభ సూచికగా సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇచ్చిన డూడుల్ అదుర్స్ అనిపించేలా ఉంది.
ఒక గ్రూప్ లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టీమిండియా అక్టోబర్ 4న న్యూజిలాండ్, 6న పాకిస్థాన్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.ప్రతి గ్రూప్ నుంచి టాప్- 2లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరుతాయి. అక్టోబరు 17, 18వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. 20న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.