Gaganyaan Mission: గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు, 2022లో ప్రయోగం, ఇంకా దొరకని విక్రమ్ ల్యాండర్ ఆచూకి, కసిమీదున్నఇస్రో చైర్మెన్ కె శివన్
ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూ మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది.
Bhubaneswar,September 22: చంద్రయాన్ 2 ప్రయోగంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో (Isro) మరో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతోంది. ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూ మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది. 2020లో మరోసారి చంద్రుని మీదకు రాకెట్ ను పంపబోతున్నది. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపై చంద్రయాన్ ద్వారా అంచనాకు వచ్చారు కాబట్టి,దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇస్రో కొత్తగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో మానవరహిత రాకెట్ ప్రయోగం చేయబోతున్నది. దీనికి గగన్ యాన్ ( Gaganyaan)అనే పేరు పెట్టారు.
మానవరహిత రాకెట్ ప్రయోగం వచ్చే ఏడాది డిసెంబర్ న, 2021 జులైలో మరోసారి ఈ ప్రయోగం చేస్తుందని సమాచారం. ఈ రెండు సక్సెస్ తరువాత 2021 డిసెంబర్ లో మనిషిని రోదసీలోకి పంపేందుకు ఇస్రో ప్రయత్నం చేస్తుందని కె శివన్ మాటల్లో తెలుస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే 2022 నాటికి ముగ్గురు భారతీయ వ్యోమగాములుతో గగన్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది.
సాయుధ బలగాల నుంచి ఫ్లైయింగ్ అనుభవం ఉన్న వ్యక్తులను ఈ ప్రయోగం కోసం ఎంపిక చేయనున్నారు. వీరికి ఇండియాలో కొంతకాలం, రష్యాలో కొన్ని రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తరువాత ఇస్రో వారిని రోదసీలోకి పంపే ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. రోదసీలోకి సొంతంగా మనిషిని పంపిన నాలుగో దేశంగా ఇండియా పేరు నిలబడే అవకాశం ఉంది. ఈ టార్గెట్ తో పాటు అంతరిక్షంలో ఇండియా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది. త్వరలోనే దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.
చంద్రుడిపై అడుగు పెట్టడం
చంద్రయాన్-2 ఆర్బిటర్ చక్కగా పని చేస్తోంది. కానీ, ఇప్పటికీ ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు (కమ్యూనికేషన్) ఏర్పరచుకోలేకపోతున్నాం. ల్యాండర్‌కు ఏమైందో తెలుసుకోవాలి. ఈ పని చేస్తూనే డిసెంబరు 2020 నాటికి అంతరిక్షానికి మొదటి మానవ రహిత రాకెట్‌ను పంపనున్నాం. ఆ తర్వాత, రెండో దానిని జూలై 2021లో పంపాలనేది మా లక్ష్యం. అనంతరం, మన సొంత రాకెట్‌లో తొలి భారతీయుడిని 2021 డిసెంబరు నాటికి అంతరిక్షానికి పంపాలని భావిస్తున్నామని ఇస్రో చైర్మెన్ కె శివన్ ( Indian Space Research Organisation chairman K Sivan) ఐఐటీ భువనేశ్వర్ స్నాతకోత్సవంలో తెలిపారు. ఇస్రో నిర్దేశించినట్లు చంద్రుడిపై అడుగు పెట్టడం మినహా చంద్రయాన్‌కు సంబంధించి అన్ని సాంకేతిక పరిజ్ఞానాలూ విజయవంతంగా పని చేస్తున్నాయని, ఇది విజయమని తెలిపారు.
ఏడున్నరేళ్లపాటు దాని జీవిత కాలం
చంద్రయాన్ ఆర్బిటర్‌ను ఏడాది కాలానికే డిజైన్ చేశామని, ఇస్రో సునిశిత ప్లానింగ్ కారణంగా ఏడున్నరేళ్లపాటు దాని జీవిత కాలం ఉండనుందని వెల్లడించారు.
విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారని, చంద్రయాన్ 98శాతం లక్ష్యాలను సాధించిందని ఆయన అన్నారు.చంద్రయాన్-2 ఆర్బిటర్ లో మొత్తం 8 పరికరాలు ఉన్నాయి. ఒక్కో పరికరం నిర్దేశించిన పనిని కచ్చితంగా పూర్తి చేస్తాయి. ల్యాండర్ కు ఏమైందనే దానిపై ఇస్రో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందనని కె శివన్ అన్నారు.
ఇస్రో చైర్మెన్ కె శివన్
చంద్రునిపై ఒక ల్యూనర్ డే (భూమిపై 14 రోజులతో సమానం) సెప్టెంబర్ 20వ తేదీతో విక్రమ్ ల్యాండర్ కాల పరిమితి ముగిసింది. ఆర్బిటర్ మాత్రం తన కక్ష్యలో తాను తిరుగుతూనే ఉంది. ల్యాండర్ ఇస్రోతో కాంటాక్ట్ మిస్ కావడానికి అసలు కారణం ఏమై ఉంటుందనే దానిపై ప్రీమియర్ స్పెస్ ఏజెన్సీ లోతుగా అన్వేషిస్తున్నట్టు ఆయన తెలిపారు.
వరుసగా ప్రయోగాలు
దీంతో పాటుగా వచ్చే ఏడాది సూర్యునిపై ప్రయోగానికి ఆదిత్య ఉప గ్రహాన్ని ఇస్రో పంపించబోతోంది. దాంతో సూర్యునిలో దాగున్న రహస్యాలను అదిత్య ఛేదించనుంది. దీంతో పాటుగా 2024లో చంద్రయాన్ 3, మంగళయాన్-2 ప్రయోగాలు చేపడుతోంది. దీని కోసం కచ్చితమైన ప్రణాళికను ఇప్పటి నుంచే సిధ్ధం చేసుకుంటోంది. ఇక 2025 శుక్రునిపైన అధ్యయనం కోసం శుక్రయాన్ ఉపగ్రహం కూడా ఇస్రో నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. అదే విధంగా 2030 నాటికి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఇస్రో రూపకల్పన చేసింది.
విక్రమ్ ల్యాండర్ ఆచూకి..
ప్రపంచంలోని మూడు ప్రాంతాల నుంచి విక్రమ్ ల్యాండర్ ఆచూకి కోసం సిగ్నల్స్ సేకరిస్తున్నారు. ఆస్ట్రేలియా, క్యాలిఫోర్నియా, యూరప్ లలో ఉన్న డేటా సిగ్నల్స్ సెంటర్స్ కు సిగ్నల్స్ వచ్చాయేమో అని ఆరా తీస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల్లోని ఎక్కడికి ల్యాండర్ నుంచి సిగ్నల్స్ వచ్చినా వెంటనే అవి ఇస్రో కు చేరిపోతాయి. దీని మీద ఆర్బిటర్ నుంచి సమాచారం రావాల్సి ఉన్నది. ఆర్బిటర్ త్వరలోనే ల్యాండర్ కు సంబంధించిన ఫోటోలను తీసి పంపించే అవకాశం ఉన్నది.
నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ర్ట్రేషన్) ఇస్రోకు సాయం చేసేందుకు తమ ల్యూనర్ రీకన్షియేషన్స్ ఆర్బిటర్ (LRO)తో రంగంలోకి దిగింది. అదృశ్యమైన రోవర్ ల్యాండర్ విక్రమ్ ఆచూకీ తెలుసుకునేందుకు LROను పంపింది. నాసా ఆర్బిటర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. ఆ ఫొటోల్లో ల్యాండర్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. చంద్రునిపై షాడోల కారణంగా విక్రమ్ కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించడంలో నాసా విఫలమైంది.