Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్.. ఆదిపురుష్ బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ప్రయోగం ఖర్చు తక్కువే!
ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ పాడ్ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.
Newdelhi, July 14: ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ – 3 (Chandrayaan-3) రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ (Countdown) విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని (AP) సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ పాడ్ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్ (Lander), రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు. ఈ ప్రయోగం అన్ని విధాలుగా విజయవంతం అవుతుందని ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రయోగంలో మూడు మాడ్యూల్స్
- ప్రొపల్షన్ మాడ్యూల్: రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్ ఇది.
- ల్యాండర్ మాడ్యూల్: చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్ దిగగానే రోవర్ బయటకు వస్తుంది.
- రోవర్: చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
ఆదిపురుష్ బడ్జెట్ కంటే తక్కువ
చంద్రుడిపై ఇప్పటివరకు అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ మాత్రమే విజయవంతంగా రోవర్లను దింపాయి. వీటి కోసం వేలకోట్లు ఖర్చు చేశాయి. ఇస్రో మాత్రం దాదాపు ఐదారు వందల కోట్ల బడ్జెట్‌తోనే ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపడుతున్నది. చంద్రయాన్-3కి రూ.650 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఇది ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమా బడ్జెట్ కంటే తక్కువేనని చెబుతున్నారు.