PM Modi on Russia-Ukraine Conflict: భారత్ ఎప్పుడూ తటస్థం కాదు! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మధ్యవర్తిత్వం వహిస్తా! ఉక్రెయిన్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు
చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు.
Kyiv, AUG 23: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Mod) స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో (Volodymyr Zelensky ) కలిసి మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కీని (Volodymyr Zelensky ) మోదీ కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే యుద్దానికి పరిష్కారానికి మార్గం కనుగొనవచ్చు. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోని చర్చించాలి. శాంతిని నెలకొల్పేదిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాననే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.
అంతకముందు రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. అక్కడికి వెళ్లే సమయంలో జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు..
కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.