Afghanistan Crisis: తాలిబన్లకు అమెరికా హెచ్చరిక, అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లాలనుకుంటే అడ్డుకోవద్దని డిమాండ్, ఈ ప్రకటనపై సంతకాలు చేసిన 65 దేశాలు, కాబూల్ విమానాశ్రయం వద్ద దారుణ పరిస్థితులు, ఎయిర్ స్పేస్ మూసివేత
అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులు దాటడానికి అనుమతులు ఇవ్వాలని తాలిబన్లను అమెరికా డిమాండ్ చేసింది.
Washington, August 16: అఫ్ఘానిస్తాన్ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులు దాటడానికి అనుమతులు ఇవ్వాలని తాలిబన్లను అమెరికా డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే అమెరికా తన డిమాండ్‌ను ప్రపంచ ముందు ఉంచింది. అఫ్ఘానిస్తాన్ నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరుకునే (Afghans Leave The Country) విదేశీయులతోపాటు అఫ్ఘానీయులను కూడా తాలిబన్లు అడ్డుకోకూడదని యూఎస్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై అమెరికా మిత్రదేశాలైన 65 దేశాలు (US Leads 65 Nations) సంతకాలు చేశాయి. కాగా, అమెరికా బలగాలు అఫ్ఘాన్ గడ్డ మీద నుంచి వెనక్కు వెళ్లిపోయిన రోజుల వ్యవధిలోనే ఈ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడం అమెరికాను కూడా ఆశ్చర్యపరుస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం కాబూల్ చేరుకున్న తాలిబన్ దళాలు.. ఈ నగరాన్ని తమ వశం చేసుకున్నాయి. ఒక్క విమానాశ్రయం తప్ప కాబూల్ నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నీ తాలిబన్ల హస్తగతం అయిపోయాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసినట్లు తాలిబన్లు ( Taliban ) ప్రకటించారు. కాబూల్‌లో అధ్యక్ష భవనాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు ఈ ప్రకటన చేశారు. అధ్యక్ష భవనంలోనే తాలిబన్ నేతలు చర్చలు నిర్వహించారు.
Here's US Tweet
ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాయిద్దిన్‌లకు ఇవాళ ఓ గొప్ప దినమని, 20 ఏళ్లుగా చేసిన త్యాగాలకు వాళ్లు ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు తాలిబన్ పొలిటిక్ ఆఫీస్ ప్రతినిధి మొహమ్మద్ నయీమ్ తెలిపారు. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని, ఈ దేశంలో యుద్ధం ముగిసిందని ఆయన అన్నారు. అమెరికా భద్రతా దళాలు వెనుదిరిగిన కొన్ని రోజుల్లోనే ఆఫ్ఘన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం శోచనీయం. తాలిబన్ కమాండర్లు అధ్యక్ష భవనంలో సాయుధ ఫైటర్లతో కలిసి సమావేశం కావడం కూడా ఆ దేశ దీన స్థితిని తెలుపుతుంది.
మరో వైపు వేలాది మంది పౌరులు ఆఫ్గన్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి (Hamid Karzai International Airport) బారులు తీరారు. తాజాగా రాజధాని కాబూల్‌లోగగనతలాన్ని మూసివేసినట్లు (Flights Suspended) అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అక్కడ మిగిలిపోయిన భారతీయులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
అంతేకాదు అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న పలు ఎయిరిండియా విమానాలను మరో మార్గంలో పంపే అవకాశాలు ఉన్నాయి. షికాగో నుంచి ఢిల్లీ వచ్చే విమానం, శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వచ్చే విమానాలను గల్ఫ్ దేశాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఆదివారం నుంచీ కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను వేల మంది ప్రజలు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడి విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.
Here are some Horrifying Visuals from the Kabul Airport:
అఫ్ఘాన్‌లో ఇంత మారణహోమం జరగడానికి, తాలిబన్లు ఆ దేశంలో రాజ్యాధికారం పొందడానికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీసుకున్న నిర్ణయమే కారణమంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ అంతర్గత వ్యవహారంలో తాము తలదూర్చకూడదనే ఉద్దేశ్యంతో యూఎస్ బలగాలను బైడెన్ వెనక్కు పిలిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఆగస్టు 31 నాటికి పూర్తికానుంది. ఈ క్రమంలో అమెరికా బలగాలు అఫ్ఘాన్ దాటి వెళ్లిన రోజుల వ్యవధిలోనే ఆ దేశం తాలిబన్ల వశం చేసుకున్నాయి. ఈ మొత్తం పరిణామాలకు బాధ్యత వహిస్తూ బైడెన్ రాజీనామా చేయాలని యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఐక్యరాజ్యసమితి భద్రత మండలి నేడు అత్యవసర సమావేశం
ఇదిలా ఉంటే అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి భద్రత మండలి(యూఎన్‌ఎస్‌సీ) నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు భారత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై ఇందులో చర్చించనున్నారు. అఫ్గాన్ పౌరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐరాస నిర్ణయించినట్లు సమాచారం.
రక్తపాతం నివారించేందుకే దేశం వదిలాను: అష్రాఫ్ ఘనీ
అప్గానిస్థాన్ గడ్డపై రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రకటించారు. తాను ఇంకా ప్రతిఘటించి ఉంటే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాలిబన్ల విజయాన్ని అంగీకరించిన ఆయన దేశ రక్షణ ఇక వారి బాధ్యతేనని చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ అధికారిక ఖాతాలో ఓ సందేశం ఉంచారు.
దేశ ప్రజలారా..! ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా దేశాన్ని వీడడం.. లేక అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాలనుకుంటున్న సాయుధ తాలిబన్లను ఎదుర్కోవడం అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే నా ముందున్నాయి. ఇంకా అనేక మంది దేశ ప్రజలు అమరులవ్వడం, కాబుల్ నగరం విధ్వంసం కావడం.. ఈ పరిణామాలు అతిపెద్ద మానవ సంక్షోభాన్ని మిగులుస్తాయి. తాలిబన్లు నన్ను దించేయాలని నిర్ణయించుకున్నారు. కాబుల్ నగరాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఈ ఘోర రక్తపాతాన్ని నివారించడం కోసమే నేను దేశం వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’’ అని ఘనీ ఫేస్‌బుక్ సందేశంలో పేర్కొన్నారు.
‘‘తాలిబన్లు విజయం సాధించారు. దేశ ప్రజల అస్థిత్వాన్ని, గౌరవాన్ని, సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదే. వారు చట్టబద్ధంగా ప్రజల హృదయాలను గెలుచుకోలేకపోయారు. వారిప్పుడు ఓ చరిత్రాత్మక పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అఫ్గానిస్థాన్ పరువు ప్రతిష్ఠలను కాపాడతారా? లేక అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారా? అఫ్గాన్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తమ భవిష్యత్తుపై వారికి భరోసా లేదు. అఫ్గాన్ ప్రజలతో పాటు వివిధ దేశాలకు తాలిబన్లు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా అఫ్గాన్ సోదరీమణుల హృదయాలను చట్టబద్ధంగా గెలుచుకోవాల్సి ఉంది. దానికోసం ఓ పక్కా ప్రణాళికను రూపొందించండి. దాన్ని ప్రజలకు బహిర్గతం చేయండి. దేశాభివృద్ధి కోసం నేను నా కృషిని కొనసాగిస్తూనే ఉంటాను. అఫ్గానిస్థాన్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ అష్రాఫ్ ఘనీ తన సందేశాన్ని ముగించారు. కాగా అష్రప్ ప్రస్తుతం తన బృందంతో కలిసి తజకిస్థాన్ చేరుకున్నారని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న తాలిబన్ శకం
అఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ శకం మొదలుకావడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పాశవికతకు మారుపేరుగా నిలిచిన ఈ ముఠా ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ తాలిబన్ల చరిత్రను ఓ సారి పరిశీలిస్తే..
పష్టో భాషలో తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. 1990లలో అఫ్గానిస్థాన్‌లో సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిదీన్ వర్గాలు.. రష్యా నిష్క్రమణ తరవాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ముజాహిదీన్ నాయకులు పాలన గురించి పట్టించుకోకుండా నిరంతరం కలహాల్లో మునిగి తేలేవారు. జనంపై విపరీతంగా పన్నులు వేసేవారు, డబ్బు కోసం కిడ్నాప్‌లకు తెగబడేవారు. దీంతో దేశమంతటా అరాచకం తాండవించింది. ఈ నేపథ్యంలో 1994లో తాలిబన్లు ముల్లా ఒమర్ నాయకత్వంలో దేశంలో సుస్థిరతను నెలకొల్పడానికి రంగంలోకి దిగారు.
సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్థాన్‌లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాల్లో వీరు చదువుకునేవారు. వ్యవస్థాపక సభ్యులంతా ఒమర్ విద్యార్థులే కావడం వల్ల.. ఆ ముఠాకు తాలిబన్ అని పేరు పెట్టారు. తాలిబన్ ముఠాలో తొలుత ముజాహిదీన్ ఫైటర్లు ఉండేవారు. పాకిస్థాన్ సైన్యం, సైనిక గూఢచారి సంస్థ ఐఎస్‌ఐల అండదండలతో తాలిబన్లు అఫ్గాన్ ముజాహిదీన్ వర్గాలను ఓడించి 1998కల్లా దేశాన్ని చాలావరకూ తమ ఏలుబడిలోకి తెచ్చుకుని శాంతిభద్రతలను పునరుద్ధరించారు. చిరకాలంపాటు యుద్ధ సంక్షోభంలో నానా అగచాట్లు పడిన అఫ్గాన్ ప్రజలకు అది గొప్ప ఊరట అనిపించింది. ప్రారంభంలో ఈ ముఠాకు మంచి ఆదరణ లభించింది. నేరాలు, అవినీతిని అరికడతామన్న హామీ వారికి సాంత్వన కలిగించింది.
అయితే వారు అధికారంలోకి వచ్చిన తరువా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇస్లామిక్ పాలన పేరిట కఠిన షరియా చట్టాన్ని అమలు చేశారు. హంతకులను, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ, పురుషులను బహిరంగంగా తలలు నరకడం లేదా ఉరితీయడం, చోరీలకు పాల్పడినవారి చేతులు నరకడం వంటి మధ్యయుగాల నాటి శిక్షలు అమలు చేశారు. పురుషులు గడ్డాలు పెంచాలనీ, స్త్రీలు తప్పనిసరిగా బురఖాలు ధరించాలనీ ఆదేశించారు. 10 ఏళ్లు పైబడిన బాలికలు పాఠశాలలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
సంగీతం, టీవీ, సినిమాలను నిషేధించారు. పరమత సహనానికి వారి నిఘంటువులోనే స్థానం లేకుండా పోయింది. 2001లో బామియాన్ బుద్ధ విగ్రహాలను ఫిరంగులతో పేల్చేయడమే దీనికి నిదర్శనం. తాలిబన్లకు పుట్టినిల్లు పాకిస్థాన్ గా చెబుతుంటారు.ఈ వాస్తవాన్ని పాక్ నాయకులు నిరాకరిస్తున్నా, తాలిబన్ తొలి తరం నాయకులు పాక్ మదర్సాల్లోనే చదివారనేది బహిరంగ సత్యం. ఒక దశలో తాలిబన్లు పాకిస్థాన్‌లోనూ అస్థిరత సృష్టించారు. పెషావర్‌లో ఒక పాఠశాలపై దాడిచేసి విద్యార్థులను ఊచకోత కోశారు. అప్పటి నుంచి పాక్‌లో వారి ప్రాబల్యం క్షీణించింది.
2020 ఫిబ్రవరిలో అమెరికా తాలిబన్లతో శాంతి ఒప్పందం
ఇక అమెరికాపై 2001 సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడిన అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అఫ్గానిస్థాన్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడని అమెరికా తేల్చింది. అతడిని తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి ఆ ముఠా అంగీకరించలేదు. దాంతో 2001 అక్టోబరు నుంచి అమెరికా, నాటో సేనలు దాడులు ప్రారంభించి తాలిబన్లను కూలదోశాయి. అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాయి.
ఆ తర్వాత అమెరికాకు తాలిబన్లతో యుద్ధం ఖర్చు తడిసి మోపెడవడంతో అక్కడి నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 2020 ఫిబ్రవరిలో తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం తాలిబన్లు అఫ్గాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో అధికారం పంచుకోవాలి. ఒప్పందంతో తమ పని పూర్తయిందంటూ అమెరికా సేనలు అఫ్గాన్ నుంచి వైదొలగడం ప్రారంభించాయి. తాలిబన్లు మాత్రం ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి దేశం మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి అఫ్గాన్ ప్రభుత్వంపై పోరు ప్రారంభించారు. రాజధాని కాబుల్ స్వాధీనంతో వారి లక్ష్యం నెరవేరింది.
అఫ్గాన్ భద్రత బడ్జెట్ కింద అమెరికా 88 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు పెట్టింది. అఫ్గాన్ జాతీయ భద్రత, రక్షణ దళాల (ఏఎన్‌డీఎస్‌ఎఫ్)ను ఏర్పాటు చేసి ఆధునిక ఆయుధాలతో శిక్షణ ఇచ్చింది. అయితే ఆప్ఘన్ సైనికాధికారులు అమెరికా కేటాయించిన బడ్జెట్ ని అక్రమంగా మింగడం ప్రారంభించారు. నకిలీ పేర్లతో సైనికులను తయారు చేసి వారి పేరు మీద జీతాలను మిగడం ప్రారంభించారు. దీంతో అక్కడ సైనిక బలం వాస్తవ లెక్కలకు చాలా తేడా వచ్చింది. అఫ్గాన్ జాతీయ భద్రత, రక్షణ దళాలు (ఏఎన్‌డీఎస్‌ఎఫ్)లో 3 లక్షల మంది సైనికులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా వాస్తవానికి 1.8 లక్షల సైన్యం మాత్రమే ఉందని తెలుస్తోంది.
మరోవైపు తాలిబన్లలో దాదాపు 2లక్షల మంది ఫైటర్లు ఉండొచ్చని అమెరికా సైనిక సంస్థల అంచనా. స్థానిక ముఠాలు, మద్దతుదారులు 90వేల మంది వీరికి సాయంగా నిలిచినట్లు విశ్లేషిస్తున్నారు. తాలిబన్లకు పాక్‌తోపాటు చైనా, రష్యాలు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. వీటికితోడు పలాయనం చిత్తగించిన అఫ్గాన్ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక పెద్దలు మధ్యవర్తిత్వం వహించి, అఫ్గాన్ సైనికులు వెనుదిరిగేలా చేశారన్న వార్తలు వచ్చాయి.