Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్‌ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
Afghanistan flag | File Image | (Photo Credits: Getty Images)

Kabul, August 15: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ అధికార మార్పిడికి (Afghanistan crisis) రంగం సిద్ధమైంది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని (Ali Ahamd Jalali to Be Appointed as New Interim Head) నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ కథనాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ ప్రచురించింది.

ప్రస్తుతం దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ సత్తార్‌ మిర్జక్వాల్‌ మాట్లాడుతూ అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నట్లు టోలో న్యూస్‌ వెల్లడించింది. మరోపక్క తాలిబన్ల ప్రతినిధి ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ పాలన పగ్గాలను స్వచ్ఛందంగా అప్పజెప్పినట్లు డెయిలీ న్యూస్‌ ఈజిప్ట్‌ పత్రిక పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడిగా ఆశ్రఫ్‌ ఘనీ రాజీనామా చేసిన నేపథ్యంలో దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్‌ కామాండర్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరదార్‌ (Mullah Abdul Ghani Baradar) బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఘనీ ఆఫ్ఘాన్‌ ముజాహిద్‌ కమాండర్‌ ముల్లా ఉమర్‌తో కలిసి తాలిబన్‌ సంస్థకు పనిచేశారు. గతంలో తాలిబన్ల పాలనలో ఓ రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2010లో పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు ఘనీని (Mullah Abdul Ghani) అరెస్ట్‌ చేశారు. 2018 అక్టోబర్‌ 24 వరకు పాక్‌ జైలులో గడిపారు. అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు. ఇతను ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు. అతను ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వ అధ్యక్షుడుగా ఉన్నారు.

ఒంటరయిన ఆప్ఘాన్, దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు, తమ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్న అమెరికా, రక్తపాతాన్ని జరగనివ్వనని తెలిపిన అఫ్గానిస్థాన్‌ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, ఇంతకీ తాలిబన్లు ఎవరు, అసలు అఫ్గానిస్థాన్‌‌లో ఏం జరుగుతోంది?

ఇదిలా ఉంటే విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, విదేశీయులు భయపడాల్సిన అవసరం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్‌లో ఉన్న విదేశీయులు రిజిస్టర్‌ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని తెలిపారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారత పౌరులు ఉన్నారు. వారిని తిరిగి రావాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది.

Here's ANI Tweet

అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతియుతంగానే కాబూల్ వైపు వస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి నిరోధం లేకుండానే కాబూల్‌లోకి తాలిబన్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో, కాబూల్ గేట్ల వద్దనే వేచి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్క రష్యా మాత్రం తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొంది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి జమీర్‌ కబులోవ్‌ పేర్కొన్నారు.