Kabul, Aug 15: అఫ్గానిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడానికి ఇక ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. తాలిబన్ (Taliban Militants) తిరుగుబాటుదారులు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించిన తాలిబన్లు.. ఇప్పుడు రాజధాని నగరాన్నీ (Afghanistan Capital Kabul) తమ ఆధీనంలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆఫ్ఘాన్‌లో మొత్తం 34 ప్రావిన్సులు ఉండగా ఇప్పటి వరకు 19 ప్రావిన్సులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్‌ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పాతుకుపోయాయి. మజారె షెరీఫ్‌లోనూ వాళ్లు తమ జెండాను ఎగరేశారు. కేవలం పది రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలను ఓడించి తాలిబన్లు మొత్తం దేశమంతా విస్తరించడం గమనార్హం.
జలాలబాద్ ఆక్రమణతో కాబుల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలోనైనా తాలిబన్ మూకలు దేశ రాజధానిలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ పౌర ప్రభుత్వ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మిగిలాయి. ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించడం లేదా వారితో భీకర పోరు కొనసాగించడం. మరో రెండు రోజుల్లో అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అంతకుముందు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని వారు శనివారం పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఐదో అతిపెద్ద రాష్ట్రమైన మజార్-ఏ-షరీఫ్‌పైనా ఆధిపత్యం సాధించారు. ప్రస్తుతం కాబూల్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా వారు దేశ రాజధానిలోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయి. కాందహార్‌లోని రేడియో స్టేషన్‌ను ఆక్రమించిన తాలిబన్లు... ఇక నుంచి ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు.
ప్రజలనుద్దేశించి మాట్లాడిన దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
తాజా పరిస్థితుల నేపథ్యంలో... దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తాను. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఆపాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. తాలిబన్ల ఆక్రమణ వల్ల దేశం పెనుముప్పును ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఘనీ అన్నారు. భద్రతా దళాలను బలోపేతం చేయడమే తమకు ప్రాధాన్య అంశమని చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని కూడా ఘనీ తెలిపారు. దేశ ప్రజలు నిర్వాసితులు కాకుండా చూస్తామని, యుద్ధం వల్ల ఇక ఎంతమాత్రం రక్తపాతాన్ని జరుగనివ్వనని చెప్పారు.
కీలక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్
కాగా- అఫ్గాన్ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పించే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్‌లు చర్చించారు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతున్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా నన్ను మిస్ అవుతున్నారా అని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
కాగా గతేడాది ట్రంప్ ప్రభుత్వం తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే తాము ముందుకు సాగుతున్నామని బైడెన్ ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల రాజ్యానికి తెరదించి, ఆ దేశాన్ని పునర్నిర్మించడానికి ఈ రెండు దశాబ్దాలలో అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 2500 మంది అమెరికా సైనికులు మృత్యువాత పడ్డారు.
చివరికి ఇంతా చేసి దళాలను ఉపసంహరించుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఈ పాపం బైడెన్‌దే అని, ఇప్పటికైనా నన్ను మిస్ అవుతున్నారా అని ట్రంప్ అన్నారు. అయితే బైడెన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. అల్‌ఖైదాపై అమెరికా యుద్ధం ఎప్పుడో ముగిసింది. అంతేకాదు 3 లక్షల మంది ఆఫ్ఘన్ సేనలకు శిక్షణ ఇచ్చాము. ఇప్పుడు వారి యుద్ధం వారే చేయాలి. వాళ్ల దేశం కోసం పోరాడాలి అని బైడెన్ స్పష్టం చేశారు.
ఇప్పటికే భారతదేశం అక్కడి నుంచి 50 మందిని ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించింది. ఇదే బాటలో అమెరికా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం 3 వేల మంది సైనికులను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పంపింది. ఎక్కువ కాలంపాటు అక్కడ ఉండేందుకు తమ సైనికులను పంపడం లేదని, ఇది తాత్కాలిక మిషన్ మాత్రమేనని అమెరికా స్పష్టం చేసింది. తమ పౌరులకు, ఎంబసీ సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అమెరికా తాలిబాన్లకు విజ్ఞప్తి చేసింది.
ఇదే సమయంలో కువైట్‌లోని అమెరికన్ బేస్ వద్ద 3,500 మంది సైనికులను కూడా అమెరికా మోహరించింది. అవసరమైన సమయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి వీరిని నియమించినట్లు తెలుస్తున్నది. ఖతార్‌లో కూడా వేయి మంది సైనికులు ఉన్నారు. ప్రత్యేక వీసాలపై అమెరికాలో స్థిరపడాలనుకునే ఆఫ్ఘన్లకు వీరు సహాయం చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ పౌరులు, మిత్రులను బయటకు తీసుకురావడంపై మాత్రమే తమ దృష్టి ఉన్నదని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. ఇది తాత్కాలిక మిషన్ మాత్రమే అని ఆయన తెలిపారు.
ఐక్య రాజ్య సమితి ఆందోళన
తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గాన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలన్నారు. బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని, అఫ్గాన్‌ను ఒంటరి దేశంగా మార్చుతుందని పేర్కొన్నారు. ప్రజలపైనా, జర్నలిస్టులపైనా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాలికలు, మహిళల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించడం హృదయ విదారకంగా ఉందన్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని తాలిబన్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
క్యాంపస్‌లో తలదాచుకునేందుకు అనుమతివ్వండి: అఫ్గాన్ విద్యార్థులు
ఇక ఢిల్లీలోని జేఎన్‌యూలో చదువుతున్న అఫ్గాన్ విద్యార్థులు... కరోనా సమయంలో తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో తాము తిరిగి వస్తామని, క్యాంపస్‌లో తలదాచుకునేందుకు అనుమతివ్వాలని వర్సిటీ ఉపకులపతికి విజ్ఞప్తులు చేస్తున్నారు. వారి తరఫున విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతలు వీసీకి లేఖ రాశారు. ‘‘అఫ్గాన్‌లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకుపోయిన మన విద్యార్థులు వెనక్కు వచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోండి. వారు క్యాంపస్‌లో ఉండేందుకు వసతులు కల్పించాలి’’ అని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రిజిస్ట్రార్ రవికేశ్ తెలిపారు.
మా దేశంలో భారత్ సైనిక చర్యలు చేపట్టకూడదు : తాలిబన్
దేశంలోని 18 రాష్ట్రాలను వశపరుచుకున్న క్రమంలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహేల్ షహీన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అఫ్గాన్ ప్రజలకు భారత్ సాయం చేయడం, జాతీయ ప్రాజెక్టులు చేపట్టడం హర్షణీయమే. కానీ, మా దేశంలో వారు సైనిక చర్యలు చేపట్టకూడదు. మా దేశంలో నివసిస్తున్న సిక్కులు, హిందువులు తమ మతపరమైన ఆచారాలు పాటించుకోవచ్చు. వేడుకలు చేసుకోవచ్చు. ఇక్కడి రాయబార కార్యాలయాలకు, దౌత్య అధికారులకు ఎలాంటి హానీ ఉండదు.
ప్రజలు తమంతట తామే తాలిబన్లకు లొంగిపోతున్నారు. సామాన్యులను చంపడం, హింసించడం ప్రభుత్వం చేస్తున్న పని. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. కానీ, ఇందుకు ప్రభుత్వమే ముందుకు రావడంలేదు’’ అని షహీన్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా తదితర దేశాలు అఫ్గాన్ నుంచి తమ అధికారులను వెనక్కి రప్పించాయి. కాగా అఫ్గాన్ నుంచి సిక్కులు, హిందువులు సహా 20 వేల మందిని తరలించనున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.
అసలు ఎవరీ తాలిబన్లు..
తాలిబన్‌లు పష్టున్ తెగలకు చెందిన వారు. పష్టున్ అంటే విద్యార్థి అని అర్థం. 1996-2001 వరకు ఆఫ్టానిస్తాన్ సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా ఉండేది. 1989 లో సోవియట్ దళాల ఆఫ్ఘానిస్తాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించాయి. అనంతరం దేశంలో ఏర్పడిన అస్థిరతను ఆసరాగా చేసుకొని తాలిబన్ నాయకుడు మోలా మహ్మద్ ఓమర్ ఇండియన్ ముజాహుదీన్ దళం సహకారంతో ఆఫ్ఘానిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకొని నియంత్రించాడు. తాలిబన్‌లు దేశంపై పట్టు సాధించి సమాచార, సాంకేతిక, రాజకీయ అంశాలను ప్రభావితం చేశారు. మహిళా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. మహిళలు చదువు ఎక్కువగా చదువుకోకూడదని బుర్కా విధిగా ధరించాలని ఆదేశించి అమలు చేశారు.
అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రవాద దాడికి కారణమైన లాడెన్‌ను అప్పగించడానికి మోలా మహ్మద్ ఓమర్ ప్రభుత్వం నిరాకారించడంతో జరిగిన పరిమాణాల కారణంగా అమెరికా ఆదేశాలతో అంతర్జాతీయ దళాలు ఆఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించి తమ నియంత్రణలోకి తీసుకొచ్చాయి. దీంతో కొందరు తాలిబన్‌లు పాకిస్తాన్ దేశం ఆశ్రయం పొందారు. దాదాపుగా 20 సంవత్సరాల తరువాత 14 నెలల కాల వ్యవధిలో అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘానిస్తాన్‌ను నుంచి సైనిక దళాలను ఉపసంహరిస్తోంది. దీంతో అక్కడ తిరిగి తాలిబన్‌లు పట్టు సాధిస్తున్నారు.