Kabul, August 13: అఫ్ఘనిస్తాన్ దేశం క్రమమంగా తాలిబాన్ ఉగ్రవాదుల వశం అయిపోతుంది. అఫ్గాన్ రాజధాని కాబూల్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా చెప్పబడే కాందహార్ నగరం తాలిబాన్ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లినట్లు ఉగ్రవాద సంస్థ ప్రతినిధి మరియు స్థానిక ప్రభుత్వ అధికారులు శుక్రవారం ఉదయం ధృవీకరించారు. గురువారం అర్థరాత్రి నుంచి భీకరంగా విరుచుకుపడిన ఉగ్రవాదులు కాందహార్ నగరాన్ని తమ హస్తగతం చేసుకున్నారని తెలిపారు.
గత మే నెలలో అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ మరియు నాటో దళాల ఉపసంహరణ జరిగినప్పటి నుంచి అఫ్గాన్ దేశం అల్లకల్లోలంలో చిక్కుకుంది. తాలిబన్ మిలిటెంట్ గ్రూప్స్ దేశంలోని అన్ని ప్రావిన్సులను ఒక్కొక్కటిగా దురాక్రమణ చేస్తున్నాయి. అఫ్గాన్ వ్యాప్తంగా 34 ప్రావిన్సులు ఉండగా అందులో ఇప్పటికే 12 ప్రావిన్సులను తాలిబాన్లు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని రెండవ అతిపెద్ద నగరం కాందహార్, మూడో అతిపెద్ద నగరం హెరాత్ సహా రాజధాని కాబూల్ నగరానికి సమీపంలో హైవేపై ఉండే కీలకమైన ఘాజ్నీ నగరం సైతం తాలిబాన్ చేతుల్లో ఉంది. దీంతో ఇప్పుడు అఫ్గాన్ ఆర్మీకి దేశం దక్షిణం వైపు ప్రయాణించడానికి మార్గం లేకుండా పోయింది. తాలిబాన్లకు ఆఫ్గాన్ సేనల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ దేనిని లెక్కచేయకుండా హింసామార్గంలో వెళ్తూ తాలిబాన్లు పైచేయి సాధిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాలిబాన్లతో సంధి ప్రయత్నాలు చేస్తుంది. ఇక హింసాత్మక ఘటనలు చాలని, దేశ పాలనను పంచుకుందామని అఫ్గాన్ ప్రభుత్వం తాలిబాన్లకు ప్రపోజల్ పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనకు తాలిబాన్ నేతలు ఇంకా స్పందించలేదు.
ఇప్పటికే కాబూల్ నగరానికి అత్యంత సమీపంలో కాచుకున్న మిలిటెంట్లు మరో రెండు, మూడు నెలల్లో రాజధాని నగరాన్ని కూడా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. ఆఫ్గాన్ లో ఉన్న ఈ భీకర పరిస్థితుల దృష్ట్యా యూఎస్ మరియు యూకే దేశాలు అఫ్ఘనిస్తాన్ లో తమ దేశానికి చెందిన రాయబార కార్యాలలో పనిచేస్తున్న సిబ్బందిని మరియు బలగాలను వారివారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి.
అఫ్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితులపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, శాంతి కోసం అఫ్ఘన్ ప్రభుత్వ చర్యలకు మద్దతిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్నారు. ఆ దేశంలో శాంతి, సుస్థిరతల గురించి ప్రధానంగా ఆందోళన ఉందన్నారు. తక్షణమే సమగ్రమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, అఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 12 ప్రొవిన్షియల్ రాజధానులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులను తిరిగి స్వదేశానికి రావాలని భారత ప్రభుత్వం కోరింది.