Afghan President Ashraf Ghani | (Photo Credits ANI)

Kabul, August 16: ఆగష్టు 15న ఒకవైపు భారతదేశంలో స్వాతంత్య్రోత్సవ వేడుకలు జరుగుతుంటే, మరోవైపు ప్రజలు అసలు స్వేచ్ఛా, స్వాతంత్య్రం అనేవే కోల్పోతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగిన పరిణామాలు కళ్లకు కట్టాయి. అఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని కాబూల్ ను తాలిబన్లు చుట్టుముట్టారని విషయం తెలియగానే ప్రజలు ఎక్కడివారక్కడ ప్రాణభయంతో పరుగులు తీశారు. జీన్స్, టీ షర్ట్స్ వెసుకున్న వారు వెంటనే ఇళ్లల్లోకి వెళ్లి సాంప్రదాయ దుస్తులు వేసుకున్నారు. యువతులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడ్డారు. బ్యూటీ పార్లర్ల వద్ద, బట్టల షాపుల వద్ద అందాన్ని సూచించే ముఖచిత్రాలను చెరిపేసి తెల్లటి పెయింట్ వేయడం కనిపించింది. కాబూల్ నగరంలోని రోడ్లపై, వీధుల్లో ఎక్కడ చూసిన జనం చెల్లాచెదురుగా వెళ్లిపోవడం, బ్యాంకుల వద్ద బారులు తీరడం, విమానాశ్రయాల వైపు పరుగులు తీయడం, మరికొంతమంది రోడ్డు మార్గానే దేశ సరిహద్దులను దాటే ప్రయత్నాలు చేయడం లాంటి దృశ్యాలు ఎన్నో కనిపించాయి. అంతా అల్లకల్లోలం, గందరగోళం. ఇంతకాలంగా స్వేచ్ఛగా బ్రతికిన వారు ఒక్కసారిగా తాలిబన్ల క్రూరమైన పాలనను తలచుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.

తాలిబన్లు తమ దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నారని తెలిసినా, రాజధాని కాబూల్ మాత్రం సురక్షితమైన ప్రదేశం అని, తమకు వెన్నంటే ప్రభుత్వం ఉంది, ఎన్నో దేశాల కార్యాలయాలు ఉన్నాయి, ఎవరైనా వచ్చి కాపాడకపోరా అనే భావనలో అక్కడి ప్రజలు ఉన్నారు. కానీ, ఆదివారం పరిస్థితులు వేగంగా మారిపోయాయి. కాబూల్ ను స్వాధీనం చేసుకోవడానికి తాలిబన్లకు సుమారు 3 నెలలు పట్టవచ్చు అని యూఎస్ ఇంటెలిజెన్స్ వేసిన అంచనా తారుమారైంది. నెలలు, వారాలు కాదు కేవలం కొన్ని గంటల్లో ఎలాంటి ప్రతిఘటన లేకుండా రాజధాని కాబూల్ సునాయాసంగా తాలిబన్ల సొంతమైంది.

ఆదివారం రోజు కాబూల్ నగరంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాలిబన్లు నగరాన్ని చుట్టుముట్టారనే సమాచారం అందగానే గగనతలంలో పదుల సంఖ్యలో అమెరికా సైనిక హెలికాప్టర్లు ఎగరటం కనిపించాయి. అవి తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు అఫ్ఘనిస్తాన్ దేశాధ్యక్షుడైన అష్రఫ్ ఘని రాజీనామా చేసి తాలిబన్ కమాండర్లకు అధికార బదిలీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, అంతకుముందే అష్రఫ్ ఘని దేశాన్ని విడిచినట్లు కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. తాలిబన్ ఫైటర్లు చుట్టుముడుతున్నారనే సమాచారం అందగానే అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్రెసిడెంట్ భవనాన్ని విడిచి యూఎస్ ఎంబసీ కార్యాలయంలో కొద్దిసేపు ఆశ్రయం పొందినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు. మధ్యాహ్నానికే అష్రఫ్ ఘని, ఆయన భార్యతో పాటు జాతీయ భద్రతా అధికారి మరియు తనకు అత్యంత సన్నిహితులైన పరిపాలనా సిబ్బందితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఇతర దేశానికి పారిపోయారు. అష్రఫ్ ఘని అమెరికాకు వెళ్లిపోతున్నారమోనని భద్రతా సిబ్బంది భావించగా, తజికిస్థాన్ వెళ్లిపోయినట్లు మరికొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే అష్రఫ్ ఘనీ మాత్రం తానుండే చోటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆయన తజికిస్థాన్ నుంచి మరో గుర్తుతెలియని ప్రాంతానికి కూడా వెళ్లి ఉండవచ్చునని అంచనా.

కాగా, 'తాలిబన్ ఫైటర్లు ఇప్పటికే లెక్కలేనంత మంది పౌరులను హతమార్చారు. మరింత రక్తపాతం జరగకముందే ప్రజల కోసం దేశం విడిచి వెళ్లడం ఉత్తమం అని భావించాను' అని అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఒక ప్రకటన వార్తా సంస్థలకు విడుదల చేశారు.

అయితే దేశాధ్యక్షుడి చర్యను అఫ్ఘన్ జాతీయ సయోధ్య ఉన్నత మండలి అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంతో తమ చేతులను కట్టివేసి, మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి దేశాన్ని, ప్రజలను అత్యంత దుర్భర స్థితిలో వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి దేవుడే శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు.

కాబూల్ లో ఉన్న వివిధ దేశాల ఎంబసీ కార్యాలయాలు మూతపడుతున్నాయి. అమెరికా ఎంబసీ కార్యాలయంపై తమ జాతీయజెండా కూడా ఎగరడం లేదు. సిబ్బంది కొన్ని కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను కాల్చివేసి, ఎంబసీ కార్యాలయాన్ని దాదాపు ఖాళీచేసి విమానాశ్రయంలో తమ దేశ సహాయం కోసం ఎదురుచేస్తున్నారు. వారి జాతీయ జెండాను తమతో తీసుకెళ్తున్నట్లు కనిపించింది.

యూఎస్, యుకె, జర్మనీ మరియు కెనడా వంటి దేశాలు తమ జాతీయులను తరలించడానికి తమ వైమానిక దళాలను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం నుండి విమానాల వెళ్లే అనుమతులు రద్దు అయ్యాయి. అయితే సైనిక విమానాలతో ఆయా దేశాలు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాయి.  అయితే, ఇండియా నుంచి ఎయిర్ ఇండియా విమానం కూడా దిల్లీ నుంచి మధ్యాహ్నం 12:30కి బయలుదేరుతుంది. ఇండియా మిలటరీ విమానాలను ఉపయోగించడం లేదని సమాచారం.

ఇక, సాధారణ పౌరులు కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. రన్ వేపైకి వచ్చి కూడా దీనంగా నిలబడి వచ్చీపోయే సైనిక విమానాల కేసి తమను ఎవరైనా రక్షించండి అంటూ అర్తిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం సిటీ బస్టాండును తలపిస్తుంది. మరోవైపు, కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు జరుగుతున్నాయి, అప్రమత్తంగా ఉండంటి అంటూ యూఎస్ అధికారులకు తమ దేశం నుంచి నివేదికలు అందినట్లు సమాచారం.