Covid in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. దేశాన్ని వణికిస్తున్న కరోనా, అయిదు నెలల తరువాత రెట్టింపు సంఖ్యలో కేసులు, నాలుగు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ అమలు, జనవరి 14న చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం
దాదాపు అయిదు నెలల తర్వాత కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు (China Records Biggest Daily Jump) అయ్యింది. దీంతో దేశంలోని నాలుగు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. హుబేయ్‌లోని షిజియాజువాంగ్, జింగ్టాయి, లాంగ్‌ఫాంట్ నగరాల్లో లాక్‌డౌన్ (4 Cities in Lockdown) అమలు చేస్తున్నారు.
Beijing, January 13: కరోనా పుట్టినిల్లుగా చెప్పబడుతున్న చైనాలో మళ్లీ కరోనా వైరస్ కేసులు జోరందుకున్నాయి. దాదాపు అయిదు నెలల తర్వాత కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపు (China Records Biggest Daily Jump) అయ్యింది. దీంతో దేశంలోని నాలుగు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. హుబేయ్‌లోని షిజియాజువాంగ్, జింగ్టాయి, లాంగ్‌ఫాంట్ నగరాల్లో లాక్‌డౌన్ (4 Cities in Lockdown) అమలు చేస్తున్నారు. అక్కడ కరోనా టెస్టింగ్ సంఖ్యను పెంచారు. మరో దఫా వైరస్ ఉదృతిని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
దేశ రాజధాని బీజింగ్ సమీపంలో ఎక్కువ శాతం సంఖ్యలో కోవిడ్ కేసులు (COVID-19 Cases) నమోదు అవుతున్నాయి. ఓ ఈశాన్య రాష్ట్రంలోనూ కేసులు ప్రబలుతున్నాయి. దాదాపు 2.8 కోట్ల మంది హోంక్వారెంటైన్‌లో ఉన్నారు. జూలై 30వ తేదీ తర్వాత దేశంలో తొలిసారి మళ్లీ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్ సమీపంలో ఉన్న హుబేయ్ ప్రావిన్సులో ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. మరోవైపు రేపే వుహాన్ నగరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు విజిట్ చేయనున్నారు. వైరస్ ఆనవాళ్లను పసికట్టేందుకు ఆ బృందం వుహాన్ సిటీకి వెళ్లనున్నది.
ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్‌ను సృష్టించి, ప్రపంచంపైకి వదిలిందన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ వైరస్ ఎక్కడ పురుడు పోసుకుందన్న విషయాన్ని నిగ్గుతేల్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సన్నద్ధమైంది. 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు చేరుకోనుంది. ఈ విషయాన్ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ సోమవారం స్వయంగా వెల్లడించారు
కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి మార్గాన్ని కనిపెట్టే విషయంలో సైంటిస్టులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. దీంతో చాలారోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. తమ దేశంలోకి డబ్ల్యూహెచ్‌ఓ బృందాన్ని అనుమతించకుండా చైనా మొండికేసిన సంగతి తెలిసిందే. నిపుణుల బృందం 14న చైనాలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. వైరస్‌కు మూలమని చాలామంది భావిస్తున్న వూహాన్ మార్కెట్‌ను సందర్శించనుంది.