Jack Ma Suspected Missing: చైనా ప్రభుత్వంపై విమర్శలు, అలీబాబా ఫౌండర్ జాక్ మా మిస్సింగ్, గతేడాది అక్టోబర్ 24న చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనీస్ బిలియనీర్
చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన మిస్ అయ్యారు. గతేడాది అక్టోబర్ 24న జాక్ మా షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Beijing, January 4: చైనా ప్రభుత్వంపై విమర్శలు చేసిన తరువాత చైనీస్ బిలియనీర్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కనిపించడం (Jack Ma Suspected Missing) మానేశారు. చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన మిస్ అయ్యారు. గతేడాది అక్టోబర్ 24న జాక్ మా షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకింగ్ పని తీరు వల్ల దేశంలో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
నాడు జాక్ మా తన ప్రసంగంలో ‘నేటి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక యుగం నాటి పరిస్థితులకు వారసత్వంగా నిలుస్తుంది. భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త వ్యవస్థను రూపొందించుకోవాలి. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించాలి. యువతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి’ అన్నారు.
రెండు నెలల క్రితం జాక్ మా తన స్వంత టాలెంట్ షో ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత నుంచి పబ్లిక్‌గా కనిపించడం లేదని (Chinese billionaire Jack Ma goes missing) తెలిసింది. జాక్ మా వ్యాఖ్యలు బీజింగ్ పాలనా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. జాక్ మా చేసిన వ్యాఖ్యలతో చైనా ప్రభుత్వం (China Govt) గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు జిన్‌పింగ్ నేరుగా తన ఆదేశాలతో జాక్ మాను అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
యాంట్ గ్రూపులో జాక్ మా సుమారు 37 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టేందుకు ప్రయత్నంచిగా.. దాన్ని అధ్యక్షుడు జిన్‌పింగ్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి చైనా అధికారులు షాకిచ్చారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా.. తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అలీబాబా సంస్థపై యాంటీ మోనోపలీ విచారణకు ఆదేశించారు. దీని వల్ల ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. జాక్ మా ఆస్తులు సుమారు 63 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక తన సొంత టాలెంట్ షో చివరి ఏపిసోడ్ తర్వాత జాక్ మా బహిరంగంగా (Jack Ma Not Seen in Public) కనిపించలేదు. ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ అన్న టీవీ షో ఫైనల్ ఎపిసోడ్‌లో న్యాయనిర్ణేతగా హాజరు కావాల్సిన జాక్ మా.. ఆ షోలో పాల్గొనలేదు. దాంతో ప్రస్తుతం అతడి భద్రత పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక టాలెంట్ షో అధికారిక వెబ్‌సైట్ నుంచి జాక్ మా ఫోటోని తొలగించారు. దాంతో అనుమానాలు మరింత పెరిగాయి.
జాక్ మా కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం అవుతుండగా.. ఆ సంస్థ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలని కొట్టి పారేశారు. అలీబాబా గ్రూపు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘జాక్ మా మిస్సయ్యారంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం. షెడ్యూల్‌లో ఏర్పడిన గందరగోళం వల్ల ఆయన ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్ షోలో కనిపించడం లేదు’ అన్నారు. ఇక ప్రస్తుతం జాక్ మా స్థానంలో అలీబాబా గ్రూపు ఎగ్జిక్యూటివ్, లూసీ పెంగ్ బాధ్యతలు స్వీకరించారు.