New Delhi, January 3: దేశంలో గత 24 గంటల్లో 18,177 మందికి కరోనావైరస్ సోకింది. కరోనా కేసుల (COVID19 Cases in India) తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం..అలాగే 20,923 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases in India) 1,03,23,965కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 217 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,435కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,27,310 మంది కోలుకున్నారు. 2,47,220 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
యూకే నుంచి ఇండియాకు ప్రవేశించిన కొత్త కరోనా వైరస్ (New Coronavirus) పైనా విజయం సాధించే దిశగా ఇండియా ప్రయత్నాలు విజయవంతం అయినట్లు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఐసీఎంఆర్ యూకే నుంచి వచ్చిన సార్స్ - కోవ్-2 వేరియంట్ నమూనాలను సేకరించి, ఆ వైరస్ జాడలు, జన్యు క్రమాన్ని కనుగొన్నామని తెలిపింది. ఈ వైరస్ ను ఎన్ఐవీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)లో పెంచుతున్నామని, తద్వారా వైరస్ కు విరుగుడు కనుక్కోవచ్చని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కొత్త వైరస్ భవిష్యత్తులో ఇంకెలా మారుతుందన్న వివరాలనూ శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 574 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,80,565 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,549కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,388 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,210 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి.