Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్ గా రికార్డు
అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తెలిపారు.
Newdelhi, Dec 30: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్ (100) (Jimmy Carter) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 తెలిపారు. 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ మరణించిన విషయాన్ని ఆయన కార్టర్ సెంటర్ ఫౌండేషన్ కూడా ధృవీకరించింది. యునైటెడ్ స్టేట్స్ కు 39వ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన జిమ్మీ కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. 2 నెలల క్రితమే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జిమ్మీ కార్టర్ అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. కార్టర్ భార్య రోసలెన్ స్మిత్. ఈ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
శాంతి ఒప్పందానికి మూలకర్త
జార్జియాలోని ప్లెయిన్స్ లో పుట్టి పెరిగిన కార్టర్ పీచ్ స్టేట్ గవర్నర్ గా, వైట్ హౌస్ కు పోటీ చేసే ముందు అక్కడే వేరుశనగ వ్యవసాయం చేశారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని రూపుమాపేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1976లో రిప్లబిక్ పార్టీ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ పై గెలిచి అమెరికా 39వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఇజ్రాయెల్ – ఈజిప్ట్ మధ్య ‘క్యాంప్ డేవిడ్ అకార్డ్స్’ అనే శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడంతో కార్టర్ పాత్ర ఎనలేనిది. ఆయన చేసిన సామాజిక, ఆర్థిక సేవలకుగానూ 2002లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.