Libya Floods: లిబియాలో డేనియల్‌ తుఫాన్‌ విధ్వంసం, రోడ్డు మీద ఎటు చూసినా శవాలే, సముద్రంలోకి కొట్టుకుపోయిన ప్రజలు, ఒక్కరాత్రే 5,300 మంది మృతి

తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు.

Libya faces devastating floods. (Photo credits: Twitter/@Cool_Ustaz)

డేనియల్‌ తుఫాన్‌ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) విలవిలలాడింది. తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు.

ఒక్క డెర్నాలోనే 5,300 మందికిపైగా మరణించి ఉంటారని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతుల సంఖ్య మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ క్రీసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్‌సీ) వలంటీర్లు ముగ్గురు మరణించారు. డెర్నా (Derna ) పట్టణం ఈ వరదలకు ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ నగరంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే కనిపిస్తున్నాయి. వాహనాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి.

తూర్పు లిబియాలో భారీ వరదలు.. 2 వేల మంది మృతి.. వేలాదిమంది గల్లంతు.. డ్యామ్ తెగడంతో డెర్నా నగరంలోకి వరద.. సముద్రంలోకి కొట్టుకుపోయిన జనం.. ఇళ్లు.. 10 అడుగుల మేర ముంచెత్తిన వరద

డెర్నాలో పరిస్థితి ఘోరంగా ఉందని.. రహదారులపైనే అనేక మృతదేహాలు పడి ఉన్నాయని లిబియా ఆరోగ్య మంత్రి ఒత్మాన్‌ అబ్దుల్‌ జలీల్‌ పేర్కొన్నారు. సముద్ర తీరంలోని పర్వతాల వద్ద డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలా వరకు పర్వత లోయలో ఉన్నాయి. దీని సమీపంలోని ఒక డ్యామ్‌ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడంతో వరద తీవ్రత పెరిగిందని లిబియా ప్రధాని ఒసామా హమద్‌ తెలిపారు.

దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కార్లు కాగితపు పడవల్లా తేలుతూ కొట్టుకుపోయాయి. వీధులు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకుంటున్న ప్రజలు కన్నీటితో తమ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సహా ఇతర దేశాలు సహాయ కార్యక్రమాల కోసం తమ బృందాలను లిబియా పంపాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే పనిలో ఉంది.

డేనియల్‌ తుఫాన్‌ ఆదివారం రాత్రి లిబియా తీర ప్రాంతాన్ని తాకింది. కొన్ని గంటల వ్యవధిలోనే తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చింది. వరదల తాకిడికి రెండు డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్యాములు ధ్వంసం కాగా అక్కడ్నుంచి పోటెత్తిన వరద నీటిలో అనేకమంది మధ్యధరా సముద్రంలోకి కొట్టుకుపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.



సంబంధిత వార్తలు